Published On: Tue, Dec 4th, 2018

అంతర్జాతీయ రవాణా వ్యవస్థకు విమాన‌యాన రంగం వెన్నెముక

* ఆ శ‌క్తి, సామర్థ్యం భారతదేశానికి ఉంది 

* గన్నవరం విమానాశ్రయంలో ప్యాసింజర్ టెర్మినల్ భవనానికి భూమి పూజ చేసిన ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు

* రూ.611 కోట్లతో, 35వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న టెర్మినల్

* గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ విమాన సర్వీసును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

* అంతర్జాతీయ సర్వీసుల ద్వారా ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక సంబంధాలు మెరుగుపడతాయని ఆకాంక్ష

* చొరవ తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విమానసేవలు అందిస్తున్న గన్నవరం విమానాశ్రయం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. రూ.611 కోట్లతో నిర్మిస్తున్న నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మంగ‌ళ‌వారం సాయంత్రం భూమిపూజ నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గన్నవరం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అంతర్జాతీయ విమాన యాన కేంద్రంగా మారే సామర్థ్యం భారతదేశానికి ఉందని తెలిపారు. విమానయానం అంతర్జాతీయ రవాణా వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ఇలాంటి సర్వీసులు వారధిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో అనుసంధానాన్ని పెంచడంతో పాటు, ఉద్యోగాల కల్పన సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఇప్పటి వరకూ గన్నవరం విమానాశ్రయంలో ఉండే సౌకర్యాలకు అదనంగా, 35 వేల చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఈ టెర్మినల్ పర్యావరణ హితంగా నిర్మితం కానుంది. 24 చెక్-ఇన్ కౌంటర్లు, 14 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 3 కస్టమ్ కౌంటర్లు, 5 బ్యాకేజ్ క్లెయిన్ కరౌసల్, ఇన్ లైన్ బ్యాగేజ్ స్క్రీనింగ్ సిస్టమ్, 1250 కార్ల పార్కింగ్ సౌకర్యం, 8 బోర్డింగ్ గేట్స్, సోలార్ ఎనర్జీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, డబుల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్ఈడి లైటింగ్, సెన్సార్స్ తో కూడిన ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేష్ ప్రభు, సహాయమంత్రి జయంత్ సిన్హా, ఆంధ్రప్రదేశ్ మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
         విమానయానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేస్తోందన్న ఉపరాష్ట్రపతి, UDAN లాంటి పథకాల ద్వారా ప్రాంతీయ అనుసంధానం మెరుగవుతుందని, దీని ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమౌతుందని తెలిపారు. ప్రముఖ బౌద్ధారామంగా పేరు గాంచిన అమరావతికి, ఈశాన్య దేశాల నుంచి సహకారం అందేందుకు ఆస్కారం ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని, పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి టీమ్ ఇండియా స్ఫూర్తితో పని చేయడం ద్వారా వివిధ రంగాల్లో అభివృద్ధికి సానుకూల వాతావరణాన్ని సృష్టించ వచ్చని, దీని ద్వారా నవీన భారతం సాకారమౌతుందని ఆకాంక్షించారు. వివిధ పార్టీల మధ్య రాజకీయ విబేధాలు ఎన్నికలతో ముగిసి పోవాలని, అధికారాన్ని అందుకున్న అనంతరం పాలన మీద, ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచించారు.
                 విమానయాన రంగాల్లాంటి మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థికాబివృద్ధికి దోహదం చేస్తాయన్న ఉపరాష్ట్రపతి, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవస్థాగత పాలనా సంస్కరణలు మరింత సంఘటితమైన సమాజాన్ని సృష్టించేందుకు సాయపడుతున్నాయని తెలిపారు. విమాన‌యాన సంస్క‌ర‌ణ‌లు, క్రమబద్ధమైన అభివద్ధి కారణంగా ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో గత ఐదేళ్ళలో 14.1 శాతం వృద్ధి సాధించామని ఉపరాష్ట్రపతి తెలిపారు. పెరుగుతున్న విమాన సౌకర్యాలు, ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు తక్కువ కార్మిక వ్యయాలు వెరసి భారతదేశం MRO ( మెయింటనెన్స్ రిపేర్ మరియు ఓవర్హాల్) విమానయానానికి అంతర్జాతీయ కేంద్రంగా మారేందుకు సామర్థ్యం కలిగి ఉందని, అదే సమయంలో కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయని, ఇవి త్వరలోనే పరిష్కారం కావాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు.
అంతర్జాతీయ విమాన సర్వీసులు చక్కని వారధి నిర్మిస్తాయి..
అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆర్థిక పర్యాటక, సాంస్కృతిక వారధిని నిర్మిస్తాయని ఉపరాష్ట్రపతి తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతితో కలిసి అభివృద్ధి చెందుతున్న విజయవాడ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండో రైల్వే జంక్షన్‌గా, ఆసియాలో రెండో అతిపెద్ద బస్ టెర్మినల్‌గా పేరు గాంచిందని, ఇప్పుడు విమానయాన రంగంలోనూ ఆ దిశగా అడుగులు వేస్తుందని, గన్నవరం విమానాశ్రయం వరుస అంతర్జాతీయ సర్వీసులతో కళకళలాడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ స‌ర్వీసులను ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఈ సర్వీసులను ప్రారంభించే విషయంలో చొరవ తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇండిగో యాజమాన్యానికి, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. విమాన సర్వీసుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తాత్కాలికంగా వయోబులిటి గ్యాప్ ఫండింగ్ ఇవ్వడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
 

Just In...