Published On: Mon, Dec 2nd, 2019

అంతర్జాల వినియోగదారులు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాలి

* ఎండ్ నౌ ఫౌండేషన్ సైబర్ సెక్యూరిటీ శిక్షకులు మనీష్ యాదవ్, అఖిలేష్

* పీబీ సిద్ధార్థ‌లో కంప్యూటర్ సెక్యూరిటీ డే కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌లో విద్యార్థుల‌కు అవ‌గాహ‌న‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శ‌నివారం కంప్యూటర్ సెక్యూరిటీ డే నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాదుకు చెందిన ఎండ్ నౌ ఫౌండేషన్ సైబర్ సెక్యూరిటీ శిక్షకులు మనీష్ యాదవ్, అఖిలేష్ విచ్చేసి విద్యార్థులకు సైబర్ నేరాలు, సమాచార చౌర్యం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసు విభాగంలో సైబర్ నేరాల పరిశోధనలో శిక్షణ అందిస్తున్న మనీష్ యాదవ్ తన ప్రసంగంలో సైబర్ నేరగాళ్లు ఏ రకంగా వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యానికి పాల్పడతారో, ఈ చౌర్యాన్ని ఏ రకంగా అరికట్టాలో ప్రయోగపూర్వకంగా వివరించారు. ఈమెయిల్ పాస్వర్డ్, సామాజిక మాధ్యమాలలో ప్రచురించే వ్యక్తిగత చిత్రాలు, ఆన్లైన్ కొనుగోళ్లకు వాడే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నంబర్లను సైబర్ చోరులు ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటారని సూచించారు. యువత స్మార్ట్ ఫోన్ల వినియోగ వ్యసనం నుండి నియంత్రించుకొని భవిష్యత్తు పై దృష్టి సారించాలని తెలియచేశారు. కార్యక్రమానికి విచ్చేసిన మరొక సైబర్ నిపుణుడు అఖిలేష్ మాట్లాడుతూ సమాచార చోరులు ఎటువంటి మార్గాల ద్వారా కంప్యూటర్లపై దాడులు చేస్తారో వివరించారు. అంతర్జాల వినియోగదారులు తరచుగా పాస్వర్డ్ మార్చుకోవటం, వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలు సామాజిక మాధ్యమాలలో పంచుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ప్రొఫెసర్ రాజేష్ జంపాల, కంప్యూటర్ విభాగాధిపతి డాక్టర్ రవికిరణ్, సెమినార్ సమన్వయకర్త కావూరి శ్రీధర్, డిజిటల్ వెల్ బీయింగ్ కౌన్సిల్ కన్వీనర్ కోనేరు సుధీర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Just In...