అంతర్వేది నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్
* లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు
అంతర్వేది(తూర్పుగోదావరి), సెల్ఐటి న్యూస్: అంతర్వేది నూతన రథాన్నిరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్ అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం జగన్ అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి జగన్.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.