Published On: Sat, Jan 5th, 2019

అంత‌ర్ విశ్వ‌విద్యాల‌యాల బాల్‌బ్యాడ్మింట‌న్ మ‌హిళ‌ల టోర్న‌మెంట్‌

* ఈ నెల 9 నుంచి ప్రారంభం

* వేదిక సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాల ప్రాంగ‌ణం

* కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్.రామకృష్ణారావు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు ఆల్ ఇండియా అంతర్‌ విశ్వవిద్యాలయాల బాలబ్యాడ్మింటన్ మహిళల టోర్నమెంట్ నిర్వహిస్తున్నటు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్.రామకృష్ణారావు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని శ్రీదుర్గామ‌లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాటాడుతూ సుమారు 18 రాష్ట్రాల నుండి 84 జట్లు పాల్గొంటాయని, 850 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, ఆర్చరీ, హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లు విజయవంతంగా నిర్వహించామని, బాల్‌బ్యాడ్మింటన్ మహిళల టోర్నమెంటను కూడా అదేవిధంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. శ్రీదుర్గామల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల మైదానంలో నాలుగు కోర్సులను కోర్టుల‌ను సిద్ధం చేస్తున్నామని, ప్రాక్టీస్‌కు అనుగుణంగా మరో రెండు కోర్టులు అందుబాటులో ఉంటాయని వివరించారు. నాకౌట్ కమ్ లీగ్ ప‌ద్ద‌తిలో జరుగుతాయని, బాల్‌బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం టోర్నమెంట్ జరుగుతుందన్నారు. క్రీడాకారులకు సిద్ధార్థ మహిళా కళాశాలలోనే వసతి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ పరిశీలకునిగా కాశ్మీర్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ వ్యాయామ, విద్యా డైరెక్టర్ డాక్ట‌ర్‌ కేవి తర్జాన్ నియమితులయ్యారన్నారు. అనంతరం టోర్నమెంట్ బ్రోచర్‌ ఆవిష్కరించారు. విలేఖరుల సమావేశంలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్ట‌ర్‌ ఎన్.శ్రీనివాసరావు, సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాల ప్ర్రిన్సిపాల్ విజ‌య‌ల‌క్ష్మీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...