Published On: Wed, Feb 12th, 2020

అందరికీ న్యాయం జరగాలి…

* బజరంగ్ జూట్ మిల్ కార్మికులు సమస్య శాశ్వత పరిష్కారానికి హైలెవల్ కమిటీ సమావేశం

* వారంలో నివేదిక ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: గతంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా గుంటూరు జిల్లాలో బజరంగ్ జూట్ మిల్ కార్మికుల విషయంలో న్యాయం జరగలేదని, కార్మికుల అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం అందరికీ న్యాయం చేసేందుకు చర్యలు ప్రారంభించిందని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో గుంటూరు జిల్లా కలెక్టరు శామ్యూల్, అజయ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్, మోహన్ రావు జాయింట్ సెక్రెటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ తదితరులతో మంత్రి సమావేశమయ్యారు. కార్మికుల సమస్యల శాశ్వత పరిష్కారానికి తమ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. అందులో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గత నెలలో దేవాదాయ శాఖ మంత్రి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని నియమించడం జరిగిందన్నారు. జూట్ మిల్ కు చెందిన యాజమాన్యం మరియు కార్మికులతో గుంటూరు జిల్లా కలెక్టర్ చర్చించి వారం రోజుల్లో కమిటీకి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అందరితో చర్చించి కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాజకీయాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా కార్మికులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సమావేశంలో మోహన్ రావు జాయింట్ సెక్రెటరీ ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, మల్లేష్ కుమార్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Just In...