Published On: Wed, Oct 9th, 2019

‘అంధత్వ నివారణ’ లక్ష్యంగా “డాక్ట‌ర్ వైయస్సార్ కంటి వెలుగు”

* ఉచితంగా కంటి పరీక్షలు

* ఆరు దశల్లో అమలు

*  నేడు అనంతపురంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్ట‌ర్ వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 10వ తేదీ గురువారం అనంతపురం జిల్లాలో ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉన్న అంధత్వంలో 80 శాతం నివారించేందుకు.. వీలున్న అంధత్వాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం మొదలుకానుంది. ఇందులో ప్రజలందరికీ ఉచితంగా సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి వారికి కంటి అద్దాల పంపిణీ, శస్త్ర చికిత్సలను ఉచితంగా చేయనున్నారు. ఆరు దశల్లో డా.వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుండగా, అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా గురువారం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు, వైద్య సేవలు అందించనున్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రాథమిక దశలో కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు తదుపరి దశలో చికిత్స అందించనున్నారు. కంటి సమస్యతో బాధపడుతున్న విద్యార్థులకు నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కంటి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు, స్వచ్ఛంధ సంస్థలు అందరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనుంది.

ఆరు దశల్లో అమలు…
డాక్ట‌ర్ వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ఆరు దశల్లో అమలు కానుంది.  ఈ కార్యక్రమంలో మొదటి, రెండు దశల్లో నవంబర్ 10వ తేదీ నుంచి 31వ తేదీ డిసెంబర్ 2019 వరకు ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఉచిత కంటి పరీక్షలు, వైద్య సేవలు అందించి కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు. అలాగే మూడు నుండి ఆరు దశల్లో 2020 జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు 4 కోట్ల రాష్ట్ర ప్రజలందరికీ 4 దశల్లో ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీ, శుక్లాల శస్త్ర చికిత్సలు, గ్లకోమా ఇతర కంటి వైద్యసేవలు అందించనున్నారు.

అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభోత్సవం…
డా.వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం 11:35 గంటలకు ప్రారంభించి సభనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఎంపిక చేసిన విద్యార్థినీ,విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అంతకుముందు సభా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు స్టాల్స్, నేత్రదాన శిబిరాన్ని, వైయస్సార్ ఆరోగ్య శ్రీ, అమ్మఒడి, పోషణ అభియాన్, విద్యార్థులకు  ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ముఖ్యమంత్రి పరీశీలించనున్నారు. అనంతరం పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు చెందిన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రా రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, 8 నుండి 10వ తరగతికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొననున్నారు.

Just In...