Published On: Mon, Apr 16th, 2018

అంబేడ్కర్‌ గొప్పతనం ప్రపంచానికి చాటుతాం

* జ‌యంతి కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

* అంబేడ్కర్‌ స్మృతివనం ఆకృతి ఆవిష్కర‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాజ్యాంగ స్ఫూర్తికి నాంది పలికిన వ్యక్తి డాక్ట‌ర్ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గుంటూరులోని తుళ్లూరు మండలం శాఖమూరులో నిర్మించనున్న అంబేడ్కర్‌ స్మృతివనం ఆకృతిని ఆయన శ‌నివారం ఉద‌యం ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మిస్తోన్న స్మృతివనంలో 18 నెలల్లోనే అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తనకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కరే స్ఫూర్తి అని తెదేపా స్థాపించినప్పుడే ఎన్టీఆర్‌ చెప్పారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్‌ మహాశయుడి ఆశయాలను తూ.చ తప్పకుండా ఎన్టీఆర్‌ అమలుచేశారన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తులు జగ్జీవన్‌రామ్‌, జ్యోతీరావు పూలే‌, అంబేడ్కర్‌ అని వివరించారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా.. దాన్ని అమలు చేసే వారి చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్‌ ఆనాడే స్పష్టం చేశారని సీఎం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో పేదవాళ్లు ఎక్కువమంది ఉన్నారని.. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు అండగా ఉంటోంది తెదేపానేనని అన్నారు. అన్ని వర్గాల నుంచి నాయకత్వం రావాలని ఆకాంక్షించారు. పేదల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న చంద్రబాబు.. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పానని.. అదే మాటపై నిలబడ్డానన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదు.. పేదవాళ్లకు భరోసాగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. పెళ్లి కానుక ద్వారా పేద పిల్లలకు పెళ్లి చేసే బాధ్యతను తీసుకున్నానన్నారు.  పేదవాళ్లకు 75 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. అంబేడ్కర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. దళితులకు తొలిసారిగా పక్కాఇళ్లు కట్టించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతి చేయడంలోనూ ఆనాడు చొరవ చూపామని, దళితులను చైతన్యవంతం చేయ‌డంతో పాటు రాజకీయంగా బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని చంద్రబాబు వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, మంత్రులు న‌క్కా ఆనంద‌బాబు, కె.ఎస్ జ‌వ‌హ‌ర్‌, ఎస్సీ, ఎస్టీ క‌మీష‌న్ ఛైర్మ‌న్ కారెం శివాజీ, ఆర్టీసీ ఛైర్మ‌న్ వ‌ర్ల రామ‌య్య‌లు మాట్లాడుతూ వెనుక‌బ‌డిన వర్గాల వారికి ప్ర‌త్యేక గుర్తింపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ల్లే సాధ్య‌మైంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ కోన శిశిధ‌ర్‌, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, ప‌లువురు ఉన్న‌తాధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.
 

Just In...