Published On: Tue, Sep 15th, 2020

అంబేడ్క‌ర్ విగ్ర‌హం ప్రాజెక్ట్ ప‌నులు స‌త్వ‌రం పూర్తి చేయండి

* ఆక‌ర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దండి

* స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్

విజ‌య‌వాడ- సెల్ఐటి న్యూస్: విజయవాడ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు, పార్క్‌ అభివృద్ది మాస్టర్‌ ప్లాన్‌పై సీఎం వైఎస్‌ జగన్ మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి సమీక్ష నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, మునిసిపల్, ఇరిగేషన్, ఆర్ధిక, సాంఘిక సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజర‌య్యారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించి వారు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చూపారు. సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ  అంబేడ్క‌ర్‌ విగ్రహం విజిబిలిటీ ముఖ్యం. ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలి. అక్కడ నిర్మించే ల్యాండ్‌ స్కేప్‌ (పార్కు) పూర్తి ఆహ్లాదకరంగా ఉండాలి. విగ్రహం ఎక్కడఏర్పాటుచేస్తే గ్రాండ్‌లుక్‌ వస్తుందో దానిపై దృష్టి పెట్టండి, గ్రౌండ్‌లో బెస్ట్‌ లొకేషన్‌ ఎక్కడో ఫైనలైజ్‌ చేయండి. వెంటనే విగ్రహం తయారీకి ఆర్డర్‌ ఇవ్వండి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలి. నవంబరు 1వ తేదీన పనులు మొదలు పెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలి. అక్కడ ఒక కన్వెన్షన్‌ హాల్‌ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, కన్వెన్షన్‌ సెంటర్, ఫుడ్‌ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాలి, వీటిపై వచ్చే ఆదాయం పార్క్‌ మెయిన్‌టెనెన్స్‌కు ఉపయోగపడుతుంది. అక్కడ వీలైనంత వరకు కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించాలి. మంచి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయండి. విగ్రహం, పార్కు గ్రాండ్‌ లుక్‌ కనిపించాలి. పనులు ప్రారంభించేలోగా ఆ స్ధలంలో ఉన్న ఇరిగేషన్‌ ఆఫీస్‌లు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వెంటనే తరలించండి. ఎంజీ రోడ్‌ నుంచి పార్క్‌ కనెక్టివిటీ కూడా అందంగా తీర్చిదిద్దాలి. మొత్తం మీద అక్కడంతా ఒక ఆహ్లాదకర వాతావరణం కనిపించాలి అని సీఎం ఆదేశించారు.

Just In...