Published On: Sat, Mar 16th, 2019

అక్కడ ప్రచారం చేయడమే చిన్నాన్న చేసిన పాపమా?

* గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్ జ‌గ‌న్‌ 

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్‌: మాజీ మంత్రి, తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని వైకాపా అధినేత జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శ‌నివారం సాయంత్రం ఆయన తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, వివేకా హత్య ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ..  రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిని ఢీకొట్టేందుకు తాము జమ్మలమడుగులో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చామని, ఆ సమయంలో నియోజకవర్గంలో అధికంగా తిరుగుతున్న తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. జమ్మలమడుగులో తిరిగి ప్రచారం చేయడమే మా చిన్నాన్న చేసిన నేరమా? అని ప్రశ్నించారు.
వివేకా హత్యలో తెదేపా ప్రమేయం లేకపోతే ఈ కేసును సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. హత్యకు గురైంది సామాన్యమైన వ్యక్తి కాదని, ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి అని ప్రభుత్వానికి తెలియదా? అన్నారు. రాత్రి ఇంట్లో ఒక్కరే ఉన్నారని తెలుసుకొని పక్కా వ్యూహంతో కిరాతకంగా హత్య చేయడం దారుణమన్నారు. తమ కార్యకర్తలను ప్రలోభ పెట్టేందుకు ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. రెండు రోజుల్లో ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే కోర్టు మెట్లు ఎక్కుతామన్నారు. వివేకాకు ఎలాంటి సెక్యూరిటీ లేదని, ఆయనెంతో సౌమ్యులని, ఎక్కడికి వెళ్లినా ఒక్కరే వెళ్లిపోతుంటారని జగన్‌ గుర్తుచేసుకున్నారు. వైకాపా శ్రేణుల సమాచారాన్ని అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి ఇస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. నిన్న తాను కడప ఎస్పీతో మాట్లాడుతుంటే ఏబీ వెంకటేశ్వరరావు ఆయనకు ఫోన్‌ చేశారని విమర్శించారు. ఏపీ డీజీపీ, అదనపు డీజీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తుల్ని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరినట్టు జగన్‌ చెప్పారు. అలాంటి అధికారులు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని జ‌గ‌న్ పేర్కొన్నారు.

Just In...