Published On: Wed, Jul 10th, 2019

అక్క‌డ రూ.60 కోట్లు అవినీతి జ‌రిగింది…

* ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజనాల వెంకటరమణారావు బాబ్జి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: జవహర్ ఆటోనగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కన్స్యూమర్ కోపరేటివ్ స్పోర్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన బహుళ అంతస్తుల సముదాయంలో రూ.60 కోట్లు అవినీతి జ‌రిగిన‌ట్లు ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు రాజనాల వెంకటరమణారావు బాబ్జి ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ రూ.25 కోట్లకు పూర్తయ్యే ప్రాజెక్టును రూ.135 కోట్లకు పెంచి లబ్ధిదారుల వద్ద అధికంగా వసూలు చేసినట్లు బాబ్జి ఆరోపించారు. నాలుగున్నర లక్షలకు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ప్లాటును అంచనా వ్యయం పెరిగింద‌ని రూ.22 నుండి రూ.30 లక్షల‌కు విక్రయించారన్నారు. అంచనా వ్యయం  పెరిగినా కూడా రూ.12 లక్షల‌కు ప్లాట్ పూర్తి అవుతుంద‌న్నారు. ఈ లెక్క వేసుకున్న ప్రాజెక్టు మొత్తం రూ.60కోట్లకు మించి ఖర్చు కాదని రాజనాల మీడియాకు తెలిపారు. ఈ ప్రాజెక్టులో డబ్బులు మిగిలినవి ఒక్కొక్క సభ్యులకు రూ.1.50 ల‌క్ష‌లు నుండి రూ.1.90 ల‌క్ష‌లు మాత్రమే ఇస్తున్నారని ఈ లెక్కన రూ.8 కోట్లు మాత్రమే వాపసు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో సుమారు రూ.60 కోట్లు పాలక యాజమాన్యం ఏం చేసిందో లెక్కలు చెప్పాలని రాజనాల డిమాండ్ చేశారు. ఈ అవినీతిలో ప్రధాన సూత్రధారి స్పోర్ట్స్ చైర్మన్  యార్లగడ్డ సుబ్బారావు, ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ తదితరుల హస్తం ఉన్నట్లుగా రాజనాల ఆరోపించారు. స్పోర్ట్స్ సొసైటీని రద్దు చేసి ప్రాజెక్టు సంక్షేమ సంఘం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్లు సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం ఐలా అసోసియేషన్ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కేసులు పెట్టుకుంటున్నారని అన్నారు. స‌మావేశంలో లబ్దిదారులు మెరుగ వెంకట రాజారావు, పరకాల శ్రీనివాసరావు, ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాపారౌతు హరివారప్రసాద్, కోశాధికారి స‌య్య‌ద్ షా సాహెబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు వి.రాఘవరావు, ఎ.సత్యనారాయణ, రావి రాంచంద్రావు, సిద్దనేని శంకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...