Published On: Tue, Jan 8th, 2019

అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠా గుట్టు

* ప‌క్కా స‌మాచారంతో నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 

* నిందితుల నుండి సుమారు రూ.5.6 కోట్లు విలువైన‌ 16.617 కేజీల బంగారపు ఆభరణాలు స్వాధీనం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: ఎటువంటి బిల్లులు లేకుండా అక్ర‌మ మార్గంలో భారీ ఎత్తున బంగార‌పు ఆభ‌ర‌ణాల‌ను త‌ర‌లిస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారం అంద‌డంతో విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ ఏసిపి జి.రాజీవ్‌కుమార్ తన సిబ్బందితో కలసి దాడులు నిర్వ‌హించ‌గా ఓ లాడ్జిలో సేద తీరుతున్న న‌లుగురు నిందితుల‌తో పాటు రూ.5,05,98,765 విలువైన 16.617 కేజీల బంగారపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గవర్నరుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీసెంట్ రోడ్డులోని ఒక లాడ్జి సమీపంలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్దనుండి ఎటువంటి బిల్లులు లేకుండా బంగారపు ఆభరణాలు త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళ్ళితే… ముంబ‌యికి చెందిన జయేష్ జైన్(42) శిల్పేష్ జైన్(25) అనే ఇద్ద‌రు వ్య‌క్తులు గ‌త కొంత కాలంగా ముంబ‌యి కేంద్రంగా చేసుకుని అక్రమ మార్గంలో బంగారాన్ని ముంబ‌యికు దిగుమతి చేసుకుని అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలలో గల పెద్ద పేరొదిన బంగారు షాపులకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా బంగారాన్ని చేరవేస్తున్నారు. ప్ర‌భుత్వానికి ఎటువంటి జిఎస్‌టి, ట్యాక్స్ చెల్లించకుండా ఖజానాకు తీవ్ర నష్టం కలిగిస్తూ దొడ్డిమార్గంలో అధిక లాభార్జనను గడిస్తున్నారు. ఈ క్రమంలో బంగారం అక్రమం తరలింపు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసిపి రాజీవ్‌కుమార్ త‌న సిబ్బందితో గత కొన్ని రోజుల నుండి ముంబ‌యికి చెందిన జయేష్ జైన్, శిల్పేష్ జైన్‌లపై గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. వీరు ఏసమయంలో ఏ ప్రాంతాలలో తిరుగుతుంది, బంగారాన్ని ఎక్కడ నుండి ఎక్కడకు చేరవేస్తుంది అనే పూర్తి సమాచారాన్ని అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసెంట్ రోడ్డు సమీపంలోని ఒక లాడ్జి దగ్గర జయేష్ జైన్, శిల్పేష్ జైన్లుతో పాటు విజయవాడకు చెందిన మనీష్ జైన్(44), పంకజ్ జైన్(42)లకు బంగారు ఆభరణాలను విక్రయిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
 

Just In...