Published On: Fri, Apr 13th, 2018

అత్యుత్త‌మ ఆనంద న‌గ‌రాల్లో అమ‌రావ‌తిని చేరుస్తాం

* ఆలోచనలతో వ‌స్తే అమలు చేస్తాం 

* ఆనంద నగరాల సదస్సు ముగింపు సభలో చంద్రబాబు విజ్ఞప్తి  

* ‘హ్యాపీ సిటీస్‌’ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ప్రారంభం 

* ఆరు మౌలిక అంశాలతో అమరావతి డిక్లరేషన్‌ విడుదల 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ ఆనంద నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు సలహాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ, విదేశాలకు చెందిన నిపుణుల్ని కోరారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరిస్తానని, వెంటనే అమల్లోకి తెస్తానని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ఆనంద నగరాల సదస్సు గురువారం ముగిసింది. చర్చాగోష్ఠులు, మేధోమథనాల్లో వచ్చిన సలహాలు, సూచనల్ని క్రోడీకరించి సిద్ధం చేసిన డిక్లరేషన్‌ను ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆవిష్కరించారు. ఆనంద నగరాల ఇన్నొవేషన్‌ ల్యాబ్‌ని ప్రారంభించారు. ‘నవ్య, సమీకృత భూసమీకరణ పథకం’ పేరుతో సీఆర్‌డీఏ ప్రణాళికా విభాగం రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ మూడు రోజుల స‌ద‌సులో ఎంతోమంది కొన్ని మౌలికమైన, విలువైన ఆలోచనల్ని, సూచనల్ని అందించార‌ని, ఆ ఆలోచనలన్నీ త‌న‌కు టానిక్‌లా పనిచేస్తాయ‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రి నుంచి అందిన ఆలోచనలన్నీ అమరావతిలో అమలుచేసి, నగరాన్ని ఒక అత్యుత్తమ నమూనాగా తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆనంద నగరాలపై చర్చించేందుకు ఒక వేదిక లేకపోవడం లోటుగా ఉండేదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆనంద నగరాల సదస్సుతో అది భర్తీ అయిందని తెలిపారు. సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ మాట్లాడుతూ… ఆనంద నగరాల సదస్సుకి రూ.5 కోట్ల కంటే తక్కువ ఖర్చయిందని, కానీ రూ.500 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆలోచనలు వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అమరావతి అభివృద్ధిలో తాము భాగస్వాములవుతామని హైదరాబాద్‌లోని బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తెలిపారు. ఈ సంద‌ర్భంగా అమరావతి కోసం వినూత్న ఆలోచనల్ని అందించిన ఆరు సంస్థలను ఎంపిక చేయగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు వారికి బహుమతులు అందజేశారు. భారత్‌కి చెందిన ‘షటల్‌’ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ఎస్‌ఈఏబీ, ఈజీగవ్‌ సంస్థలు నిలిచాయి. వీటితో పాటు ప్రత్యేక కేటగిరీగా మెటావెర్స్‌, వాలెట్‌ ఈజెడ్‌, ఆసియా ఇనీషియేటివ్‌ సంస్థలకు బహుమతులు అందజేశారు. ఈ ఆరు సంస్థలతో సీఆర్‌డీఏ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఆ సంస్థలన్నీ తమ ఆలోచనల అమలుకి ఈ రోజు నుంచే పని ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆనంద నగరాల హ్యాకథాన్‌లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, శ్రీకాకుళంలోని ఎస్‌ఎంఎల్‌ డీఏవీ స్కూల్‌ విద్యార్థులకు ముఖ్యమంత్రి బహుమతులు అందజేశారు. కార్య‌క్ర‌మంలో మ‌హిళా క‌మీష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, విద్యుత్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అజ‌య్‌జైన్‌, విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌, సీఆర్డీఏ క‌మీష‌న‌ర్ చెరుకూరి శ్రీధ‌ర్‌, వివిధ దేశాల ప్ర‌తినిధులు, గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ కోన శశిధ‌ర్‌, సీఐఐ ప్ర‌తినిధులు, రాజ‌ధాని రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...