Published On: Thu, May 10th, 2018

అధికారులపై నమ్మకం పెరిగింది

* ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయి ఇంకా పెర‌గాలి

* క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: నూతన ఆలోచనల సృష్టికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేందుకు కలెక్టర్ల సమావేశం ఎంత‌గానో దోహదం చేస్తుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షోభంలో జట్టుగా పనిచేసి ఎక్కడా లేని అభివృద్ధి సాధించామని.. అందుకు అధికారులను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఉండ‌వ‌ల్లిలోని గ్రివెన్స్ సెల్‌లో బుధ‌వారం జ‌రిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు సాధించిన ఫలితాల్లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉంద‌ని పేర్కొంటూ.. విజయం అనేది నిరంతరం శ్రమతో సాధ్యమని, కొద్దిపాటి మనసు పెడితే అద్భుతాలు సాధించవచ్చని ముఖ్య‌మంత్రి తెలిపారు. అమరావతి లాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా రాదన్నారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ తమదేనని.. తాము చేపడుతున్న కార్యక్రమాలు ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయలేకపోతున్నాయని తెలిపారు. నాలుగేళ్ల విజయాల్లో గ్రామస్థాయి అధికారి నుంచి సీఎంవో అధికారుల వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. ప్రస్తుతం ఒక స్థాయికి వచ్చామని, దానిని నిలుపుకుంటూ ఇంకా ముందుకు వెళ్లేందుకు మనందరం మరింత కష్టపడాలని సీఎం సూచించారు. ఒక జిల్లా విజయం సాధించాలన్నా, ఒక కార్యదర్శి విజయం సాధించాలన్నా, మంత్రి విజయం సాధించాలన్నా మంచి జట్టును ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాము పేరు కోసమే పనిచేసే వాళ్లమని, తాము చేసే అభివృద్ధి, మంచిపనుల వల్ల తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ 2029 కంటే ముందే దేశంలో నంబర్‌వన్ రాష్ట్రం అవుతుందని.. తన జట్టు(అధికారులు)ను చూశాక ఆ నమ్మకం రెట్టింపయ్యిందని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఇన్నోవేటర్స్ అందరూ ఏపీకి వచ్చేలా చూడాలన్న ముఖ్యమంత్రి, వాళ్ల ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్‌ వేదిక కావాలన్నారు. ఇండియాలో ఇన్నోవేషన్ వ్యాలీ ఎక్కడ ఉందంటే ఏపీనే గుర్తుకురావాలని, ఆరోజు ఎంతో దూరంలో లేదన్నారు. ప్రతీ శాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచన చేయాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ ఈ విషయంలో ముందుందని, గ్రామాలకు సంబంధించి సమస్త సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయడం అభినందనీయమన్నారు. పరిష్కార వేదిక’ కాల్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్లు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరైనా అవినీతి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ సమాచారాన్ని ఆర్టీజీ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తామని.. ఈ సమాచారాన్ని అధికారులు ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయిని 5శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
 

Just In...