Published On: Thu, Jan 10th, 2019

అధికార దాహంతో సీఎం కావాలని కలలు కంటున్న జగన్

* మంత్రి నక్కా ఆనందబాబు విమర్శ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి అధికార దాహంతో సీఎం కావాలని కలలు కంటున్నారని సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, సాధికారిత శాఖల మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. సచివాలయంలో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ నిన్న ముగించిన పాదయాత్ర అంతా బూటకంగా అభివర్ణించారు. అది పాదయాత్ర కాదని, విహార యాత్ర అని అన్నారు.  ఆ పాదయాత్రకు నిన్న ముగింపు ఏమిటని, ప్రతి 5 రోజులకు ముగింపేనని ఎద్దేవా చేశారు. ఆయన సరాసరి రోజుకు 8 కిలో మీటర్లు మాత్రమే పాదయాత్ర చేశారన్నారు. మొర్నింగ్ వాకింగ్, ఈవెనింగ్ వాకింగ్ లా చేసి ఆ పాద యాత్ర వల్ల ప్రజలకు ఏమీ ప్రయోజనం లేదని, ఆయన ఆరోగ్యానికి ఉపయోగపడిందన్నారు. కోడికత్తి పేరుతో మరో 19 రోజులు విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. పాదయాత్ర అంటే రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకోవడం, సమస్యలపై ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి, ఆయా శాఖలకు పంపి పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. అయితే ఆయన పాదయాత్రలో విజ్ఞప్తులు ఇచ్చినవారే లేదన్నారు. పాదయాత్రకు జగన్ కొత్త నిర్వచనం చెప్పారని విమర్శించారు. నోటి దురుసు, దూల వదిలించుకోవడానికి, చంద్రబాబు నాయుడుని విమర్శించడానికేనన్నారు. పాదయాత్ర సమయంలో ఆయన ఎక్కడైనా రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం గురించి మాట్లాడారా?, ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారా? అని ప్రశ్నించారు. కేంద్రం అడుగడుగునా దగా చేస్తోందన్నారు. సీబిఐ కేసులు ఉండటం వల్ల కేంద్రంలో ఎవరు ఉంటే వారి కాళ్లు నాకుతుంటావ్ అని విమర్శించారు.  ప్రజా సమస్యలను శాసనసభలో మాట్లాడకుండా ఏం వరగబెడదామనుకుంటున్నారని జగన్ ని ఉద్దేశించి అడిగారు.
              ఇతని తండ్రి చేవెళ్ల నుంచి పాదయాత్ర చేసి, 23 జిల్లాల్లో ఏవిధంగా దోచుకోవాలో పరిశీలించారని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఎలా దోచుకోవాలో తెలుసుకోవడానికి ఆయన పాదయాత్ర చేశారని విమర్శించారు. ఆయన తండ్రి సెజ్ ల పేరుతో దోచుకున్నారని, ఆ తరువాత జగన్ జైలుకు వెళుతూ అధికారులను కూడా వెంట తీసుకువెళ్లారని చెప్పారు. 2009 ఎన్నికల్లో రూ.18 కోట్లు ఆస్తి ఉన్నట్లు ఆస్తుల వివరాలు తెలిపిన జగన్మోహన రెడ్డి 2010లో రూ.80 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టారని తెలిపారు. 2014 ఎన్నికలలో తండ్రి చనిపోయారన్న సానుభూతితో ఆ సీట్లైనా వచ్చాయని, ఈసారి అవికూడా రావన్నారు. ఆయన గెలిస్తే 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను రూ.5వేలు జీతం ఇచ్చి పెడతానని చెబుతున్నారని, దోపిడీని వ్యవస్థీకృతం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. 30 ఏళ్లు దోచుకోవడానికి ప్లాన్ వేశారన్నారు.
పాదయాత్ర ముగింపు సందర్భంగా రైతులను ఆదుకుంటానని చెబుతున్నారని, వారిని తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుందని మంత్రి స్పష్టం చేశారు. వారు ఈ నాలుగున్నర ఏళ్లలోనే ఆనందంగా ఉన్నారని చెప్పారు. పట్టిసీమ ద్వారా డెల్టా ఆయకట్టు  12.5 లక్షల ఎకరాలకు నీరందించామని, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించామని చెప్పారు. మొక్కజొన్న, జొన్న, పసుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించామని, కర్నూలులో ఉల్లి రైతులను ఆదుకున్నామని, మిర్చికి ధర లేకపోతే బోనస్ ఇచ్చి ఆదుకున్నామని వివరించారు.
            కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్ మాత్రం అమరావతి నిర్మాణాన్ని, పోలవరం ప్రాజక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కోడి కత్తి కేసుని టెర్రరిస్టు కేసులా ఎన్ఐఏకి అప్పగించడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. జగన్మోహన రెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలని సలహా ఇచ్చారు. బీజేపీ ద్రోహం చేసిందని, రాష్ట్రం పట్ల అవమానకరంగా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ తో కలిసింది తమ స్వార్థం కోసం కాదని, రాష్ట్రం కోసమని స్పష్టం చేశారు. తాము గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రమాణం చేసిందని మంత్రి ఆనందబాబు తెలిపారు.

Just In...