Published On: Thu, Sep 10th, 2020

అనంతపురం–దిల్లీ మధ్య కిసాన్‌ రైలు..!

* వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

(అమ‌రావ‌తి బ్యూరోసెల్ఐటి న్యూస్‌): కిసాన్ రైలు వ‌ల్ల ఎంతో ప్ర‌యోజ‌నం ఉంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు.
అయితే కిసాన్ రైలు ఛార్జీల విష‌యంలో మాత్రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ఛార్జీలు త‌గ్గిస్తేనే మ‌రింత ఉప‌యోగం ఉంటుంద‌ని సీఎం జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఉద్యాన పంటల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ రైలును ప్రారంభించింది. దేశంలో ఈ రైలు రెండవది కాగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇది తొలి కిసాన్‌ రైలు. దిల్లీ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొనగా బుధ‌వారం ఉద‌యం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, ప‌లువురు రైల్వే ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అనంతపురం నుంచి ఎంపీ టి.రంగయ్య, సికింద్రాబాద్‌ నుంచి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా, గుంతకల్‌ నుంచి డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అలోక్‌ తివారీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. అన్ని చోట్ల నుంచి అందరూ ఒకేసారి పచ్చ జెండా ఊపి అనంతపురం నుంచి కిసాన్‌ రైలును ప్రారంభించారు. అనంతపురం నుంచి బయలుదేరిన తొలి కిసాన్‌ రైలులో ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండికి 322 మెట్రిక్‌ టన్నుల పండ్లు రవాణా చేస్తున్నారు. ఈ
సందర్భంగా సీఎం వైయస్‌ జగన్ మాట్లాడారు. ‌
కిసాన్ రైలుతో ఎంతో ప్ర‌యోజ‌నం ఉంది. ఈరోజు ఎంతో గుర్తుండిపోయే రోజు. కిసాన్‌ రైలును ప్రారంభిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రైలు కేవలం 322 మెట్రిక్‌ టన్నుల హార్టికల్చర్‌ ఉత్పత్తులను మాత్రమే కాకుండా, ఎందరో రైతుల సంతోషాలను, వారి చిరునవ్వులను కూడా వెంట తీసుకువెళ్తోంది. పలు పండ్ల ఉత్పత్తుల లోడుతో వెళ్తున్న ఈ రైలు ఇక్కడి రైతుల్లో ఒక విశ్వాసం కల్పిస్తోంది.

ఫ్రూట్‌ క్యాపిటల్‌గా ఏపీ…
దక్షిణ భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఫ్రూట్‌ క్యాపిటల్‌గా నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా పండ్ల ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 15.6 శాతం. ఆ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలకు, ఇప్పుడు ప్రారంభిస్తున్న కిసాన్‌ రైలుతో రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ రైలు ప్రారంభిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కిసాన్‌ రైలు ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద పెద్ద నగరాలకు చేరనున్నాయి.

గతంలో రైతులది దారుణస్థితి…
గతంలో పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు కూడా లభించక మోసానికి గురైన రైతులు చివరకు తమ పంటలను పొలాల్లోనే వదిలిన పరిస్థితి. అందుకే రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం వీలైనన్ని చర్యలు చేపడుతోంది.

ధరల స్థిరీకరణ నిధి…
రైతులను ఆదుకునేందుకు మా ప్రభుత్వం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటుచేసింది. ఆ నిధితో కోవిడ్‌ సమయంలో కూడా రైతులను ఆదుకునేందుకు పూర్తి మద్దతు ధర చెల్లిస్తూ, పలు పంటలను కొనుగోలు చేసింది. ముఖ్యంగా త్వరగా చెడిపోయే పంటలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది.

ఉద్యాన పంటల్లో అగ్రగామి…
ఇక ఉద్యాన పంటల్లో రాష్ట్రం ఏ స్థానంలో ఉంది అంటే, రాష్ట్రంలో 17.42 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా, దాదాపు 312.75 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. టమోటా, బొప్పాయి, కోకో, మిర్చి ఉత్పత్తిలో రాష్ట్రం తొలి స్థానంలో ఉండగా, మామిడి, ఆరెంజ్, పసుపు ఉత్పత్తిలో దే«శంలోనే రెండో స్థానంలో నిల్చింది.

రాష్ట్రం నుంచి ఎగుమతులు…
రాష్ట్రంలో అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతున్న అరటి ఎగుమతుల కోసం ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఇదే అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి 49 రిఫ్రిజిరేటర్ల కంటెయినర్లతో ప్రత్యేక రైళ్లు నడిపాం. మొత్తం 11 రైళ్ల ద్వారా 45 వేల మెట్రిక్‌ టన్నుల అరటి, 1185 టన్నుల కూరగాయలు, 7794 టన్నుల మామిడి గుజ్జు, 1471 మెట్రిక్‌ టన్నుల తాజా మామిడి పండ్లు తరలించి, ముంబై పోర్టు మీదుగా పలు దే«శాలకు ఎగుమతి చేశాం. దీంతో అరటి పండ్లు ఎగుమతి చేసిన ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ఐసీఏఆర్‌–ఎన్‌ఆర్‌సీ ద్వారా అవార్డు కూడా దక్కింది.

ఇప్పుడు కిసాన్‌ రైలులో..:
ఇప్పుడు అనంతపురం నుంచి బయలుదేరుతున్న కిసాన్‌ రైలులో 214 టన్నుల టమోటా, 75 టన్నుల అరటి, 20 టన్నుల బత్తాయి, 2.5 టన్నుల బొప్పాయి, 8 టన్నుల ఖర్బూజ, పుచ్చకాయలు, 3 టన్నుల మామిడి రవాణా అవుతున్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకును, తక్కువ వ్యవధిలో రవాణా చేయడం వల్ల ఇది తప్పకుండా అందరికీ మేలు చేస్తుంది. ఈ కిసాన్‌ రైలు రాష్ట్ర రైతులకు తప్పనిసరిగా ఎంతో మేలు చేస్తుందని నమ్ముతున్నాను. ఇదే సమయంలో నాదొక విన్నపం. ఉద్యాన పంటల రవాణా కోసం ఒక్కో మెట్రిక్‌ టన్నుపై రైల్వే శాఖ వసూలు చేస్తున్నమొత్తం, రోడ్డు మార్గం ద్వారా అయ్యే వ్యయంతో పోలిస్తే కాస్త ఎక్కువే ఉంది. కాబట్టి రవాణా ఛార్జీలు తగ్గించాలని కోరుతున్నాను. అదే విధంగా రెగ్యులర్‌గా వాటిని రవాణా చేసేలా రైలు సదుపాయం కల్పించండి. అలా చేస్తే రైతులకు ఇంకా మంచి ధర దక్కి, వారికి మేలు చేస్తుంది.

సురేష్‌ అంగడి, రైల్వే శాఖ సహాయ మంత్రి…
‘2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం రావాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ కల. గతంలో రోడ్లు కూడా సక్రమంగా ఉండేవి కావు. కానీ నాటి ప్రధాని వాజ్‌పేయి గారు రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇప్పుడు ప్రధాని మోదీ, రైతుల కోసం ఎన్నో చేస్తున్నారు. వాటిలో భాగమే ఈ కిసాన్‌ రైలు. దూర ప్రాంతాలకు సైతం కేవలం 36 గంటల వ్యవధిలో పంటల రవాణా సాగుతోంది.
ఈ కిసాన్‌ రైలు కూడా ఇప్పుడు రాష్ట్ర రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ దిశలో ఇంకా మరిన్ని చర్యలు చేపడతాము. రవాణా ఛార్జీలు తగ్గించాలన్న ఎంపీ కోరికను, సానుకూలంగా పరిశీలిస్తాము. రాబోయే రోజుల్లో కిసాన్‌ రైలును రెగ్యులర్‌గా నిర్వహిస్తాము’.

నరేంద్రసింగ్‌ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి…
‘ఇవాళ ఎంతో ఆనందకరమైన దినం. అనంతపురం నుంచి కిసాన్‌ రైలు బయలుదేరుతోంది.
అందుకు అందరికి అభినందనలు. గ్రామాలు, రైతులు బాగుండాలని ప్రధాని నిరంతరం ఆకాంక్షిస్తారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావాలని ఆయన తలపెట్టారు. ఆ దిశలో ప్రతి బడ్జెట్‌లో రైతులకు మేలు చేస్తున్నారు. ఆ ప్రక్రియలోనే కిసార్‌ రైళ్లు ప్రారంభం. రైతులు తక్కువ వ్యయంతో తమ ఉత్పత్తులను రవాణా చేసుకునే విధంగా కిసాన్‌ రైళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఆ మేరకు ఆగస్టు 7న తొలి రైలు మహారాష్ట్ర నుంచి బిహార్‌కు ప్రారంభించింది. ఆ రైలుకు మంచి డిమాండ్‌ ఉండడంతో, వారానికి ఒక రోజు బదులు, ఇప్పుడు రెండు సార్లు నడుపుతున్నాం. ఇప్పుడు రెండో రైలు ఏపీలోని
అనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తోంది’.

టి.రంగయ్య, అనంతపురం ఎంపీ…
‘ఈ ప్రాంతంలో పండ్ల ఉత్పత్తి ఎక్కువ. కానీ మార్కెటింగ్‌ కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. రోడ్డు మార్గంలో వారం నుంచి 10 రోజుల సమయం పట్టేది. దాని వల్ల ఖర్చు ఎక్కువ అయ్యేది. దాని వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలిగేది కాదు. ఇప్పుడు కిసాన్‌ రైలు ఏర్పాటు చేయడం వల్ల, గతంలో కంటే రైతులకు ఇప్పుడు ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. అయినప్పటికీ రవాణా ఛార్జీలు కాస్త అయినా తగ్గిస్తే రైతులకు ఇంకా మేలు కలుగుతుంది.

 

Just In...