Published On: Wed, Apr 4th, 2018

అనాధ బాల‌ల సంక్షేమం కోసం పోలీస్ శాఖ కృషి

* “ఆపరేషన్ ముస్కాన్” తో వీధిబాల‌ల జీవితాల్లో వెలుగులు

* విజ‌వ‌యాడ సీపీ గౌతం స‌వాంగ్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: దారి తప్పతున్న బాలలకు “ఆపరేషన్ ముస్కాన్” ద్వారా మంచి భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ క‌మీష‌న‌ర్ డి.గౌతం స‌వాంగ్ తెలిపారు. పోలీస్ క‌మీష‌న‌ర్ కార్యాల‌యంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీపీ గౌతం స‌వాంగ్ మాట్లాడుతూ పోలీస్ న‌గ‌ర శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన బృందం స‌భ్యులు 62 మంది అనాధ వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించామ‌న్నారు. తల్లిదండ్రుల నిరాధరణకు, నిర్లక్ష్యానికి గురైన వారు అలాగే ఊహ తెలియని వయస్సులో తప్పిపోయిన బాలలు సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా చెడునడతకు త్వరగా ఆకర్షించబడి నేరస్తులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా మారడం, దోపిడీకి గురికావడం, మత్తు పానీయాలు, పదార్థాలకు అలవాటుపడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నార‌ని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ ముస్కాన్” కార్యక్రమంలో భాగంగా విజయవాడ పోలీస్ శాఖ అనాధ వీధి బాలలు మరియు బాల కార్మికులను అదే విధంగా వివిధ కారణాల వలన ఇంటి నుండి బయటకు వచ్చిన వారిని గుర్తించడం జరుగుతోంద‌ని తెలిపారు. అనంతరం వారీ పూర్తి వివిరాలు తెలుసుకుని తల్లి దండ్రుల పర్యవేక్షణ లేక నిర్లక్ష్యానికి గురైన వారు, అలాగే వివిధ ప్రాంతాల నుండి నగరానికి చేరుకున్న బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం, తల్లి దండ్రులు లేని బాలలను ప్రభుత్వ ఆర్గనైజేషన్లకు అప్పగించి చర్యలు తీసుకుంటున్న విషయం విధితమేన‌ని తెలిపారు. ఈ క్రమంలో విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో “ఆపరేషన్ ముస్కాన్” నిర్వహించి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉండి కూడా నిరాధరణకు, నిర్లక్ష్యానికి గురై నగరానికి చేరుకున్న బాలబాలికలు రోడ్లపైన, ఫుట్ పాత్ల పైన నిద్రిస్తు, ఊహ తెలియని వయస్సులో తప్పిపోయిన పిల్లలు, అలాగే అనాధ బాలబాలికలు మొత్తం 62 మందిని రైల్వేస్టేషన్, పండిటినెహ్రూ బస్స్టాండ్, హోటళ్ళు, మార్కెట్లు, రద్దీ కూడళ్ళు, వాణిజ్య సముదాయాల వద్ద గుర్తించడం జరిగింది. ఇందులో 61మంది బాలురు, బాలికలు-1 ఉన్నార‌ని. వీరిలో 47 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, తెలంగాణా రాష్ట్రానికి చెందిన -1 బాలిక, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వారు-3, రాజస్థాన్‌కు చెందిన వారు-9 మంది మరియు మహారాష్ట్రకు చెందిన వారు -1 ఉన్నార‌ని చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణ మరియు వారికి మంచి భవిష్యత్ అందించడం ద్వారా వారి జీవితాలు బాగుపరచాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు విజయవాడ పోలీస్ శాఖ చర్యలు తీసుకుకోవం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో బాలల పరిరక్షణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో బాలమిత్రను ఏర్పాటు చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించడం తద్వారా సమాజంలో వీధి బాలలు మరియు బాలకార్మిక వ్యవస్థను రూపు మాపేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. ఈ నేపధ్యంలో బాలమిత్రలో భాగంగా ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ నగరంలో పలు మార్లు “ఆపరేషన్ ముస్కాన్” నిర్వహించడం జరిగిందని, తద్వారా గతంతో పోల్చితే ప్రస్తుతం వీధి బాలలు మరియు బాలకార్మిక వ్యవస్థ చాలావరకు తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రస్తుతం పోలీసులు గుర్తించిన బాలలను ఒకొక్కరిపై ప్రత్యేక శ్రద్ధ వహించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గుర్తించిన బాలల కుటుంబ నేపథ్యం, ఇంటి నుండి బయటకు వచ్చిన కారణాలు, సంక్షేమం తదితర పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం వారిని సిడబ్ల్యూసి వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో ఇతర స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ శాఖల సహకారం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రచార మాధ్యమాలు కూడా తమ వంతు భాగస్వామ్యం మరియు సహకరించి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఈ సంద‌ర్భంగా ఆయా పిల్ల‌ల‌తో పాటు వారి త‌ల్లిదండ్రుల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించి ఇక‌మీద‌ట వారు రోడ్ల‌పైకి రాకుండా చూడాల‌ని సూచించారు. చ‌క్క‌గా చ‌దువుకుని వృద్ధిలోకి రావాల‌ని ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో డీసీపీ డాక్ట‌ర్ గ‌జారావు భూపాల్‌, అడ్మిన్ డీసీపీ జె.బ్ర‌హ్మారెడ్డి, సీఎస్‌డ‌బ్ల్యూ డీసీపీ అమ‌ర్‌నాథ్‌, వివిధ డివిజ‌న్ల ఏసీపీలు, సీఐలు,  ఎస్ఐలు, ఛైల్డ్ వెల్ఫేర్ ఆర్గ‌నైజేష‌న్, బాల‌ల సంర‌క్ష‌ణకు సంబంధించి స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
 

Just In...