Published On: Tue, Feb 18th, 2020

అను హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ సదస్సు

◆పీడియాట్రిక్ విభాగంలో ఆధునిక ఆవిష్కరణలపై విస్తృత చర్చ

◆ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సదస్సులు ఉపయుక్తంగా ఉంటాయి

◆డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సలహా సంఘం సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: వైద్య సదస్సుల నిర్వహణ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందరికీ చేరువయ్యే అవకాశం లభిస్తుందని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సలహా సంఘ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు అన్నారు. ఆదివారం నగరంలోని ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్లో అను హాస్పిటల్స్ నిర్వహించిన చిన్నపిల్లల వైద్య సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ (ఐఏపీ) సహకారంతో, అను సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ అప్డేట్ 2020 పేరుతో నిర్వహించిన ఈ వైద్య సదస్సులో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన 540 మంది వైద్య నిపుణులు, యువ వైద్యులు పాల్గొన్నారు. పీడియాట్రిక్ న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలతో పాటు చిన్నపిల్లలకు సంబంధించిన సర్జరీల గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న వైద్య విధానాలతో పాటు, ఆధునిక ఆవిష్కరణల గురించి వక్తలు ప్రసంగించారు. అను పీడియాట్రిక్ సీఎంఈకి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ దుట్టా రామచంద్రరావు ప్రసంగిస్తూ చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించి అనేక అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పీడియాట్రిక్ విభాగంలో నిష్ణాతులైన వైద్యులను ఒక వేదికపైకి తీసుకొచ్చి, యువ వైద్యులకు మార్గనిర్దేశం చేసేలా సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సదస్సు ద్వారా సముపార్జించుకున్న విజ్ఞానాన్ని వైద్యులు అందిపుచ్చుకుని ప్రజలకు అత్యాధునిక సేవలందించాలని డాక్టర్ దుట్టా రామచంద్రరావు పిలుపునిచ్చారు. సదస్సుకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరించిన అను హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ జి.రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అను న్యూరో అండ్ కార్డియాక్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, చిన్నపిల్లల వైద్యానికి సంబంధించిన వివిధ విభాగాలపై సమగ్రమైన అధ్యయనం జరిపేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా నిలుస్తుందని అన్నారు. అనంతరం ప్రముఖ డయాబెటాలాజిస్ట్ డాక్టర్ కె.శ్రీదేవి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ద్వారా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య సేవలను అన్ని వర్గాల ప్రజలకు అందించడమే లక్ష్యంగా పీడియాట్రిక్ అప్డేట్ 2020 నిర్వహించినట్లు చెప్పారు. చిన్నపిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు అందించగలిగితే ఆరోగ్యకరమైన నవ సమాజ నిర్మాణం జరుగుతుందని డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. ఈ సదస్సుకు కార్యనిర్వాహక కార్యదర్శులుగా ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు, పీడియాట్రిక్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పి.నటరాజ వ్యవహరించగా, సైన్టిఫిక్ కమిటీ సభ్యులుగా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.వి.వరప్రసాద్, న్యూరాలజిస్టు డాక్టర్ తోట నవీన్, న్యూరో సర్జన్ డాక్టర్ వోసూరి బాలబాలాజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ నరాలశెట్టి అనిల్ కుమార్, డాక్టర్ కె.కిరణ్ కుమార్ వ్యవహరించారు. ఈ సదస్సులో కోచి అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పీడియాట్రిక్ న్యూరో విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ కె.పి.వినయన్, ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజీ న్యూరో సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ తీగల రమేష్, ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ వర్మ, ప్రఖ్యాత నియోనెటాలాజిస్ట్ డాక్టర్ ఎస్.రాంప్రసాద్ పాల్గొని వివిధ అంశాలపై నిర్వహించిన సైన్టిఫిక్ సెషన్లలో ప్రసంగించారు. ఐఎంఏ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ పి.వి.మధుసూదనశర్మ, కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్, ఐఏపీ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ పి.ఎస్.ఎన్.మూర్తి, కార్యదర్శి డాక్టర్ తమ్మారెడ్డి సందీప్, ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ జె.విజయభాస్కరరావు, ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎస్.కొండలరావు తదితరులు ఈ సదస్సుకు అతిధులుగా హాజరయ్యారు.

 

Just In...