Published On: Mon, Dec 3rd, 2018

అను హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

* సరైన సమయంలో చికిత్స ద్వారా అంగవైకల్యం నుండి శాశ్వత విముక్తి

* ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గా నాగరాజు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులైన చిన్నారుల కోసం అను హాస్పిటల్స్‌లో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గా నాగరాజు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా దివ్యాంగులైన చిన్నారుల కోసం ఏటా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. సరైన సమయంలో నాణ్యమైన చికిత్స అందించడం ద్వారా చిన్నపిల్లల్లోని అంగవైకల్యాన్ని శాశ్వతంగా నయం చేయవచ్చని తెలిపారు. పుట్టుకతో అంగవైకల్యం, కాళ్లు, చేతులు వంకరపోవడం, సెలిబ్రిల్ పాల్సీతో నడవలేని పిల్లలకు ప్రతి ఏటా ప్రపంచ వికలాంగుల దినోత్సవం నాడు ఉచిత వైద్యం అందిస్తున్నామని, అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. దొడ్డికాళ్లు వంకరకాళ్లు, వంకర చేతులు, కాళ్ల హెచ్చుతగ్గులు, భుజం గూడు పక్కకి తొలగిపోవడం, పుట్టుకతో అంగవైకల్యం, ఇన్ఫెక్షన్ కారణంగా ఎముకలు క్షీణించడం, ప్రమాదాల్లో కాళ్లు, చేతులు వంకరపోవడం, బుద్ధిమాంద్యం కారణంగా నడవలేకపోవడం (సెలిబ్రిల్ పాల్సీ) తదితర శారీరక అంగవైకల్య రుగ్మతలకు ఈ శిబిరంలో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మెదడు కణజాలం దెబ్బతినడం కారణంగా సంభవించే సెలిబ్రిల్ పాల్సీ రుగ్మతకు ఫిజియోథెరపీ, బొటాక్స్ ఇంజెక్షన్, ఆపరేషన్ ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. చిన్నపిల్లల్లోని అంగవైకల్యాన్ని సరిచేసి, వారు సాధారణ జీవనం గడిపేలా చేసేందుకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు అను హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ దుర్గా నాగరాజు వివరించారు. నిర్ధారణ పరీక్షల అనంతరం అవసరమైన చిన్నారులకు ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అను హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ జి.రమేష్, డాక్ట‌ర్ కె.శ్రీదేవి, ఫిజియోథెరపిస్టు రమ్య తదితరులు పాల్గొన్నారు.
 

Just In...