Published On: Fri, Nov 9th, 2018

అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ నమూనా

* దార్శనికతతోనే రెండంకెల వృద్ధిరేటు

* హ్యాపీనెస్ ఇండెక్స్‌లో దేశంలో అగ్రగామి

* సేవారంగం మరింత పటిష్టం కావాలి

* పారిశ్రామిక రంగంలో ప్రగతి బేరీజు

* వ్యవసాయం, ఉద్యానం, ఆక్వాల రంగాలపై మరింత దృష్టి

* ‘కాంపిటీటివ్‌నెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్’పై దిశానిర్దేశం

* ప్రణాళికా విభాగంతో 3వ వ్యూహాత్మక సమావేశంలో సీఎం 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్.టి.జి, సామాజిక, కుటుంబ వికాసం, సుస్థిర సమ్మిళిత లక్ష్యాలు ఇవాళ దేశాభివృద్ధి సూచికలలో నమూనాలుగా నిలిచాయని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్  హ్యాపీనెస్ ఇండెక్స్ లో అత్యధిక సంతృప్త శాతం సాధించి ముందున్నదని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ‘కాంపిటీటివ్‌నెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్’ అనే అంశంపై ప్రణాళికా విభాగంతో ఆయన మూడో వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. 2009 నుంచి 2014  వరకు రాష్ట్రం  6.2%గా వృద్ధిరేటును నమోదు చేసిందని, అయితే తాము అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో తమ ప్రత్యేక దార్శనిక దృష్టితో 10.5% వృద్ధిరేటు సాధించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం  రాష్ట్రం 11.22% వృద్ధి రేటు సాధించిందని, ఈ రేటును 16%కు తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సుస్థిర సమ్మిళిత ఆర్ధికాభివృద్ధికి  ప్రభుత్వం దార్శనిక విధానాన్ని అవలంబించిన ఫలితంగా రెండంకెల వృద్ధిరేటు సాధన సాధ్యమైందన్నారు. మత్స్యరంగం, ఉద్యాన రంగం పశుగణాభివృద్ధి రంగంలో 2014-18 మధ్య ఇతోధిక వృద్ధిరేటు సాధించామన్నారు.
హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో 44వ ర్యాంకు..
వివిధ విభాగాల్లో ఈ నాలుగేళ్లలో 600 అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ 44 వ స్థానంలో ఉందని, ఇదే సమయంలో మనదేశ స్థానం 133కు పడిపోయిందన్నారు. మరిన్ని మెరుగైన చర్యలతో, హ్యాపీనెస్ ఇండెక్స్ లో  రాష్ట్రం మరింత ముందజ వేయాలని సీఎం అన్నారు. నాణ్యమైన గాలి, మంచినీరు, సేవలు, మౌలిక సదుపాయాలతో అత్యధిక సంతృప్త, సంతోష స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళదామని అన్నారు. కళాత్మక సంబరాలు, క్రీడా పోటీలు, బాలలు, యువత, పెద్దలు ఆనందంగా, ఆహ్లాదంగా జీవించేందుకు అనువైన వాతావరణం సృష్టిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు  తెలిపారు. రైతు బజార్లను ఆధునీకరిస్తామని, గిరిజన సహకార సంస్థ ద్వారా అటవీ ఉత్పత్తుల విక్రయాలు, శిల్పారామాల ఏర్పాటుతో ప్రజలకు సంతృప్తితో జీవించేందుకు అనువైన వాతావరణం సృష్టించామని అన్నారు.
గతంలో వ్యవసాయానికి నీటి లభ్యత లేక సమస్యగా ఉండేది ఇఫ్పుడు నీటి నిర్వహణతో ఆ సమస్యను అధిగమించిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మైక్రో ఇరిగేషన్, నదుల అనుసంధానం, వాగులు, వంకల అభివృద్ధితో నీటిలేమి సమస్యలేదని తెలిపారు. రైతులకు వ్యవసాయంపై భరోసా పెంచామని, నీటి లభ్యత తక్కువగా ఉండే రాయలసీమలో రైతాంగాన్ని ఉద్యానరంగంవైపు మళ్లించడంలో కృతకృత్యులమయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో అనంతపురం,  చిత్తూరు జిల్లాలలో ఉద్యాన రంగం అభివృద్ధి చెందిందని ఆయన వివరించారు. పరిణతితో, పరిపక్వతతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చని చంద్రబాబు సూచించారు.
 సేవారంగమే కీలకం
 సేవా రంగం కొన్ని జిల్లాలలో అభివృద్ధి చెందుతోంది. కొన్ని జిల్లాల్లో మందగమనంలో ఉంది. ఈ పరిస్థితిని మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఎంఓయూలను ఆధారంగా చేసుకుని ఎన్ని కార్యాచరణకు వచ్చాయి తదితర అంశాలను అనుసరించి ఒక దార్శనిక పత్రాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పశుగణాభివృద్ధిలో వృద్ధి కనపడుతోందని, ఆహారశుద్ధి పరిశ్రమలకు ఇతోధికంగా కృషి చేయాలన్నారు. జాతీయ రహదారుల పరిధిలో పారిశ్రామిక నడవలను ఏర్పాటు చేయాలని సూచించారు.
 చిత్తూరులో టెక్స్ టైల్ పార్కు, ఓర్వకల్లులో ఫార్మా, రామాయపట్నం, కాకినాడ, విశాఖ- ఇచ్చాపురం, దొనకొండ, అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేల సమీపంలో ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు.
పోర్టు ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఎగుమతి, దిగుమతులకు అనువైన పరిశ్రమలు తేవాలని కోరారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత స్వరూపం అనూహ్యంగా మారిపోతుందని అన్నారు. పోర్టులు, జాతీయ రహదారుల వల్ల  త్వరితగతిన అభివృద్ధి సాధ్యమన్నారు.  ఇదిలా ఉంటే పరిష్కార వేదికలో 1100 ఫోన్ నెంబరుకు వస్తున్న ఫిర్యాదులు పరిష్కారాలపై ముఖ్యమంత్రి ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబుకు పలు సూచనలు చేశారు.
వ్యవసాయం నుంచి ఉద్యానం, ఆక్వా రంగాలకు మళ్లించాలి
2019-24 నాటికి  అనువైన చోట, వనరులున్న చోట వ్యవసాయదారులను మరింత లాభార్జన కోసం  వ్యవసాయ రంగం నుంచి ఆక్వా రంగానికి మళ్లించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.  తక్కువ నైపుణ్యం కలిగిన వారిని ఫుడ్ ప్రాసెసింగ్ వైపు మళ్లించాలన్నారు.  ఉద్యానం, మత్స్య, పాడిపరిశ్రమల రంగాలు అధికోత్పత్తితో సుస్థిర అభివృద్ధికి బాటవేస్తాయని, అదనంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగిస్తాయన్నారు. పరిశ్రమల శాఖతో సంప్రదించిన మీదట ఆహార శుద్ధి దార్శనికత (ఫుడ్ ప్రాసెసింగ్ విజన్)కు రూపకల్పన చేయాలన్నారు.
 2014-18 మధ్య నాలుగేళ్లలో పారిశ్రామిక రంగంలో 9.5% వృద్ధిరేటు సాధించగా,  ఉత్పాదక రంగం వాటా 8.9% కిందికి వచ్చిందని వివరించారు. ఉత్పాదక రంగంలో 13% నుంచి 15% వృద్ధిరేటు సాధనతోనే జి.ఎస్.డి.పి లో సంపూర్ణ వృద్ధిరేటు సాధ్యమని  (CAGR) చెప్పారు. ఉత్పాదక రంగ వాటాను 18% నుంచి 20%కు తీసుకెళ్లాలన్నారు.
2019-24 అభివృద్ధి వ్యూహంలో విజన్ మేనేజిమెంట్ బృందం  ప్రతిపాదించినట్లు ఒక్కో నగరానికి రూ.100 కోట్లు వెచ్చింది 10 ఆర్ధిక నగరాలు నిర్మించాల్సి ఉందని ముఖ్యమంత్రి  చెప్పారు.  అలాగే 30 ఎం.ఎస్.ఎం.ఇ క్లస్టర్లను, వీసీఐసీ (4 నోడ్లు), సీబీఐసీ (3 నోడ్లు) త్వరగా పని ప్రారంభించే విధంగా, థాయ్‌లెండ్, చైనాతో పోటీపడే తరహాలో రూపొందించాలని ముఖ్యమంత్రి అన్నారు.
 ఎకనమిక్ కారిడార్లుగా హైవేలు
అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ వే, కర్నూలు-బెంగళూరు నేషనల్ హైవేలను ఎకనమిక్ కారిడార్లుగా మళ్లించాలని కోరారు.  ఫిన్‌టెక్ ఉత్పాదనలు, కొత్తగా వస్తున్న ఐటీ సంబంధ సాంకేతికతలు, విశ్వ వాణిజ్య ధోరణులకు అనుగుణంగా విధానాలకు రూపకల్పన చేయాలని సూచించారు.
వృద్ధిరేటు సాధనకు పారిశ్రామికాభివృద్ధి చాలా కీలకమని, పారిశ్రామికరంగంలో వృద్ధిరేటు ఎంత ఉంది? మరింత ప్రగతి సాధనకు సమీక్షించుకొని తగిన కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మొబైల్ రంగంనుంచి ఆటోమొబైల్ రంగం వరకు అభివృత్ధి చేశామని, వెనుకబడిన అనంతపురం జిల్లాలో కియామోటార్స్ ను ఒప్పించి పరిశ్రమను తెచ్చామని చెప్పారు.  గత మూడేళ్లుగా సేవారంగంలో జీవీఏలో  అంతగా వృద్ధి లేదని ముఖ్యమంత్రి చెప్పారు.  తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో చేసిన కృషికి ఇప్పుడు అక్కడ ఆర్ధిక వ్యవస్థ  మెరుగైన స్థితిలో ఉందన్నారు.   శంషాబాద్ ఎయిర్ పోర్టు, బిజినెస్ స్కూలు, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చారు. హెచ్.సి.ఎ లాంటి కన్వెన్షన్ సెంటరు అంతర్జాతీయ స్థాయి సమావేశాల కోసం నిర్మించామని గుర్తుచేశారు. ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు.
 ఉద్యానరంగంలో నష్టాలు తక్కువ
వ్యవసాయంతో  పోలిస్తే ఉద్యానరంగంలో నష్టాలు తక్కువని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
స్థిరమైన వద్ధిరేటు సాధనకు ఉద్యానం, వ్యవసాయం, మత్స్య రంగాలు దోహదపడతాయని సీఎం చెప్పారు. ఈ మూడు విభాగాలు మెరుగైన ఫలితాలకోపం ఒక కార్యశాల నిర్వహించి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సేవారంగమే ఆర్ధిక వ్యవస్థకు కీలకం
సేవారంగం ద్వారానే ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తాము హైదరాబాద్ లో తాము సేవారంగం అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామని, మెరుగైన ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వచ్చేందుకు హోటళ్ల నిర్మాణం జరగాలని, వచ్చినవారు రెండు రోజులు గడిపి వెళ్లే విధంగా సదుపాయాలుండాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో అయినా  మరెక్కడయినా సేవారంగ అభివృద్ధికి ఫుడ్ కోర్టులు, హోటళ్లు రావాలని అన్నారు.  టూ స్టార్, త్రీస్టార్, ఫోర్ స్టార్ హోటళ్ల అభివృద్ధితో పర్యాటక రంగానికి ఊపువస్తుందని చెప్పారు.   రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశంలోనే పొడవైన సముద్రతీరం కలిగిన రాష్ట్రాలలో మన రాష్ట్రానిది ద్వితీయ స్థానమని అన్నారు. నదీ ముఖద్వారాలు, ప్రకృతి పర్యాటకం, సాహప పర్యాటక రంగాలకు హంగులున్నాయని చెప్పారు.
హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ, అమరావతిలో రిసార్టులు వస్తున్నాయని చెప్పారు. 
నగర ప్రాంతాల్లో 6 లక్షల ఇళ్లు..
నగర ప్రాంతాలలో 6 లక్షల ఇళ్లు కట్టిస్తున్నామని,  రాజధాని అమరావతిలో 15-20  లక్షల మంది నివసించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.  బయటి ప్రాంతాల్లో అమరావతి ప్రాంత పిల్లలు 2  నుంచి 4 లక్షల మంది చదువుతున్నారని,  ఇక్కడే ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు నెలకొల్పితే అభివృద్ధిలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.
మురికివాడల సుందరీకరణ..
పట్టణ ప్రాంతాలలో మురికివాడలను భవిష్యత్తులో అత్యంత సుందరంగా కన్పించాలని సీఎం అధికారులకు సూచించారు. అక్కడ కూడా దుకాణాలు, షాపింగ్ మాల్స్ రావాలన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిచాలని కోరారు. ఈరోజు రూపొందించిన భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా కష్టపడి పనిచేద్దామన్నారు. రిటెయిల్ మేనేజిమెంట్ ఏజెన్సీ ఏర్పాటుతో బ్రాండ్ అమరావతికి శ్రీకారం చుట్టాల్సి ఉందని,   చేతివృత్తుల కార్మికులు, స్వయం సహాయక మహిళలకు, రైతులకు రిటెయిల్ మేనేజిమెంట్ ఎంతో మేలుచేస్తుందని చెప్పారు. ఉత్పత్తి సంఘాలను కనీసం 5  కొత్త గ్లోబల్ కంపెనీలతో అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. గత నాలుగేళ్ళలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దారిద్ర్య నిర్మూలను సుసాధ్యం చేశాయని, ఆరోగ్యం, ప్రాథమిక విద్య రంగాలకు సంబంధించి అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. 2030 నాటికి నగరాల జనాభా రెట్టింపు అయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నగరాలలో పెరగనున్న జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించాల్సి ఉందని సీఎం అన్నారు.
2019-24లో విజన్‌కు అనుగుణంగా నిర్దేశిత లక్ష్యాలు..
జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు, గీటురాళ్లకు అనుగుణంగా జీవన ప్రజల జీవన ప్రమాణ స్థితిగతులను మెరుగుపరుస్తారు. ఇందుకోసం కెపాసిటీ బిల్డింగ్‌లో న్యూ ఏజ్ గవర్నెన్స్ ను అనుసరిస్తారు. గ్రీన్ ఎకానమీ లో భాగంగా  ప్రకృతి సేద్యం (ZBNF), గాలి, చెట్టు, ఎకో-టూరిజం ఉంటాయి. మరింత నివాస యోగ్యంగా, పోటీతత్వంతో కూడిన అర్బన్ క్లస్టర్ విధానం అనుసరించాలని రాష్ట ప్రణాళికా విభాగం దార్శనిక పత్ర బృందం సూచించింది. పరిశోధన, కొత్తగా వస్తున్న సాంకేతికత, ఫిన్ టెక్ ఆధారంగా నాలెడ్జి ఎకానమీ ఏర్పాటును లక్ష్యాలుగా నిర్దేశించింది.

Just In...