Published On: Tue, Mar 19th, 2019

అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేక నిఘా

* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది

* భారీగా నగదు, మద్యం పట్టివేత

* ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించండి

* రాజకీయ పార్టీలకు సీఈవో పిలుపు

*  ఏప్రిల్ 5లోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. వచ్చే నెల అయిదో తేదీలోగా కొత్త ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు జారీచేస్తామన్నారు. రాష్ట్రంలో ఎవరూ ఎన్నికల నియమావళిని అతిక్రమించొద్దని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహణకు అన్ని పార్టీలూ సహకరించాలని ఆయన కోరారు. మంగ‌ళ‌వారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడారు. రాష్ట్రంలో మీడియా సర్టిఫికేషన్, మానటరింగ్ కమిటీ షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి పనిచేస్తోందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్ పై నిశిత పరిశీలన చేస్తొందన్నారు. వివిధ రాజకీయ పార్టీల సోషల్ మీడియాకు సంబంధించి 89 నోటీసులు జారీ చేశామని, వాటిలో తెలుగుదేశం పార్టీకి 48, వైఎస్ఆర్ సిపి కి 30, జనసేన పార్టీ కి 11 నోటీసులిచ్చామన్నారు. వాటిపై ఆయా పార్టీల నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన పార్టీలు తప్పు చేసినట్లు కాదని స్పష్టం చేశారు. వారిచ్చే సమాధానాలు సంతృప్తి కలిగితే ఆ పార్టీలపై ఎటువంటి చర్యలూ ఉండబోవన్నారు. ఒకవేళ వారి సమాధాన సంతృప్తి కలిగించకపోతే, అభ్యర్థులపై మూడు రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థుల ఖర్చుల కింద జమ చేయడం, మరోసారి పునరావృతం కాకూడదని హెచ్చరించడం, పోలీసుల చేత ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయించడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు.
అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలపై పర్యవేక్షణ..
సోషల్ మీడియాపై పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిత్యమూ పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నామినేషన్ల పర్వం ముగిసిన నాటిన నుంచి అభ్యర్థుల వారీగా సోషల్‌మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తామన్నారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే కథనాలు, ప్రకటనలపై ముందుగా నోటిసులిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ఓటర్ల ప్రలోభాలకు గురిచేసేలా పోస్టింగ్ లు పెట్టిన వారిని ముందుగా హెచ్చరిస్తామన్నారు. వినకుంటే, జరిమానా విధిస్తామని, లేకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని, అవసరమైతే ఈ రెండింటినీ కూడా అమలు చేస్తామని తెలిపారు. అన్ని పార్టీల అభ్యర్థులూ బాధ్యయుతాంగా మెలగాలన్నారు.
రాష్ట్రంలో 3,635 సీ విజల్స్ బృందాలు….
రాష్ట్రంలో ఉన్న 175 నియోజక వర్గాల్లో 3,635 సీ విజిల్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సీ విజిల్స్ ద్వారా నేటి వరకూ 1,304 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. పోస్టర్లు, బ్యానర్లు, గిఫ్టులు, డబ్బు, మద్యం పంపిణీ, మత,కులపరమైన ప్రచారాలు, ప్రచార సభలకు జనాల తరలింపు, లౌడ్ స్పీకర్ల వాడకం, వంటి వాటిపై సీ విజల్స్ కు ఎక్కువగా పిర్యాదులు
వస్తున్నాయన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు సంబంధించి అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎం.సి.ఎం.సి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.
భారీగా నగదు, మద్యం స్వాధీనం…
రాష్ట్రంలో పలు చోట్ల చేపట్టిన సోదాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. పోలీస్, కమర్షియల్ టాక్స్, ఇన్ కమ్ టాక్స్, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసుల ఆధ్వర్యంలోని
ఫ్లయింగ్ స్క్వాడ్ లు రూ..2,39,89,135 నగదు సీజ్ చేశారన్నారు. బంగారం 8 కేజీల 26 గ్రాములు, వెండి 22 కేజీలు, 1,043 మద్యం బాటిళ్లు, రెండు వాహనాలు, 33 కేజీల గంజాయి, 324 చీరలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. పోలీస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్లు రూ.7,51,30,981 నగదు, బంగారం 128 కేజీలు, వెండి 18.46 కేజీలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు రూ.2,69,35,920ల నగదు  పట్టుకున్నారన్నారు. ఎక్సైజ్ అధికారులు రూ.7.35 కోట్ల విలువ చేసే 2 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇవే కాకుండా కోట్లాది రూపాయల విలువ చేసే గంజాయి, వాహనాలు, చీరలు, సెల్ ఫోన్ లు ఖైనీ, గుట్కా ప్యాకెట్లను కూడా పట్టుకున్నారన్నారు.
ఏప్రిల్ 5లోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు… 
మార్చి 15వ తేదీ నాటికి రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. జనవరి 11 తేదీ నుంచి 15 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. కొత్తగా మరో 9 లక్షల నుంచి 10 లక్షల పెరిగే అవకాశం ఉందన్నారు. వారందరికీ వచ్చే నెల 5వ తేదీలోగా ఓటరు గుర్తింపు కార్డులు జారీచేస్తామని తెలిపారు. 10,62,441 ఫారం-6 దరఖాస్తులు ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు. వాటిని ఈ నెల 25వ తేదీలోగా పరిశీలిన చేస్తామన్నారు. రాష్ట్రంలో 1,55,099 డెత్, డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని, వారి పేర్లను జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. మార్చి 10 వ తేదీ తరవాత ఓటర్ల లిస్టులో పేర్లు తొలగింపు నిలిపేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.84 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. ఆ సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశముందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎంసిసి నియమావళిని పాటించే బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించేలా అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన మార్చి 10వ తేదీ నుంచి ఎమ్ సిసి బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఎన్నికల నియమావళి పార్టీలకు మాత్రమే కాదని, ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికీ వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీఈవోలు వివేక్ యాదవ్, సుజాత శర్మ, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Just In...