Published On: Tue, May 7th, 2019

అమరావతిలో ఈదురు గాలులతో భారీ వర్షం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు పలు ప్రాంతాల్లో వర్షం అనుకోని అతిథిలా వచ్చి ఉపశమనం కలిగించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో మంగ‌ళ‌వారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ ఈదురు గాలులకు హైకోర్టు క్యాంటీన్‌ పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ఈ రేకులు పడటంతో రమణమ్మ అనే మహిళకు గాయాలవ్వడంతో ఆమెను గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ గాలులకు నగరంలోని పలుచోట్ల హోర్డింగ్‌లతో పాటు చిన్నచిన్న చెట్లు, టెంట్లు కూలిపోయాయి. మంగళగిరిలో గత మూడు రోజులుగా ఎప్పుడూలేనంత స్థాయిగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఈ రోజు కురిసిన వర్షం అక్కడి ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. చిరుజల్లులుగా మొదలై వడగండ్ల వానగా మారింది. విజయవాడలోనూ భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. విశాఖ జిల్లాలోని చోడవరం, బుచ్చయ్యపేటలో ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు కొద్దిపాటి వర్షంతో ఊపిరిపీల్చుకున్నారు. పలుచోట్ల వాతావరణం ఆహ్లాదపరిచింది. తాడేపల్లి ఎస్‌బీఐ ఎదురుగా ఉన్న భవనంపై భారీ హోర్డింగ్‌ కూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
పలుచోట్ల పిడుగులు పడే అవకాశం: ఆర్టీజీఎస్‌
గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ, మంగళగిరిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఆర్టీజీఎస్‌ ప్రకటించింది. తాడేపల్లి, దుగ్గిరాల, గుంటూరు, తెనాలి, ప్రత్తిపాడులోనూ పిడుగులు పడే ప్రమాదం ఉంది. అలాగే, కృష్ణా జిల్లా బాపులపాడు, నూజివీడు, గన్నవరం, పెనమలూరులో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. విజయవాడ అర్బన్‌, విజయవాడ రూరల్‌, నందిగామ, కంకిపాడు తదితర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని తెలిపింది.
 

Just In...