Published On: Sun, Dec 2nd, 2018

అమరావతిలో డేంగ్ పాథాలజీ ల్యాబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: న్యూఢిల్లీకి చెందిన డేంగ్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ నవీన్ డేంగ్, ఆయన తనయుడు డాక్టర్ అర్జున్ డేంగ్ విజయవాడ ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో శనివారం ఏపీసీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను కలిశారు. అమరావతి రాజధాని నగరంలో హై ఎండ్ కాప్రహెన్సివ్ పాథాలజీ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు తమకు ఆసక్తి ఉందని తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ పాథాలజీ ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కమిషనర్‌కు వివరించారు. పాథాలజీ ల్యాబ్ ప్రాజెక్ట్ రిపోర్టును అందజేశారు. రూ.30 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న పాథాలజీ ల్యాబ్లో 150 మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పాథాలజీ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి సానికులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. 1983లో న్యూ ఢిల్లీలో ఏర్పాటు అయిన డేంగ్ పాథాలజీ ల్యాబ్ ఎంతో ప్రసిద్ధి గాంచిందని, అమరావతిలోనూ తమ ల్యాబ్ గ్లోబల్ లెవల్లో టాప్ ల్యాబ్‌గా తీర్చిదిద్దాలనే ఆసక్తి ఉందని కమిషనర్‌కు వారు వివ‌రించారు. డేంగ్ పాథాలజీ ల్యాబ్‌కు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

Just In...