Published On: Sat, Sep 9th, 2017

అమరావతి రండి… అవకాశాలిస్తాం…

* జన్మభూమికి సేవలందించండి

* ఎ.ఎ.ఐ.ఎం.ఎస్ శంకుస్థాపన సభలో ఎన్నారైలకు చంద్రబాబు పిలుపు

సెల్ఐటి న్యూస్‌,  అమరావతి: ‘ఇన్నేళ్లుగా ఇక్కడ పనిచేసే అవకాశాలు లేక హైదరాబాద్‌కో, ఢిల్లీకో, అమెరికాకో వెళ్లారని, ఇప్పుడు ప్రపంచంలో ఉండే తెలుగువారంతా వచ్చి పనిచేసే అవకాశం అమరావతిలో కల్పిస్తాం రండి’ అని  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఇప్పడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అద్భుత అవకాశాలు వస్తున్నాయని, ప్రపంచస్థాయి వైద్య సంస్థలు ఏర్పాటవుతున్నాయని ముఖ్యమంత్రి  వివరించారు. గురువారం విజయవాడ ఎ1 కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆయన ఇబ్రహీంపట్నంలో ప్రవాసాంధ్రులు నిర్మించనున్న అమరావతి అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఎఐఎంఎస్) కు మీటనొక్కి శంకుస్థాపన చేశారు.   అమరావతి-అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రపంచ స్థాయి ఆస్పత్రిగా రూపొందాలని   చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భవిష్యత్తులో అధునాతన వైద్యానికి, అత్యవసర వైద్యానికి, అన్ని రకాల క్లిష్ట చికిత్సలకు అమెరికానుంచే రోగులు అమరావతి వచ్చి చికిత్స చేయించుకుంటారని అన్నారు.

aaims_inaugration_07-09-17_4
నవనీత కృష్ణ  ఇండియా వచ్చినప్పుడు తమను కలిశారని, మెడికల్ కళాశాలతో కూడిన బోధనాస్పత్రి నిర్మించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారని, భూమి ఇవ్వడానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ సర్పంచ్, దాత మల్లెల పద్మనాభరావు ముందుకు వచ్చారని, అంతకు ముందు భూ వివాదం కోర్టులో ఉంటే..అందరినీ పిలిపించి మాట్లాడామన్నారు. ఆ భూమిలో ఒక మెడికల్ కాలేజీ పెడితే బాగుంటుందని సూచించారని చెప్పారు. ఎన్నారైలు కళాశాల పెట్టడానికి ముందుకు రాగా, దీనికి అడ్డంకులు సృష్టించకూడదని ఒక నిర్ణయం తీసుకున్నామని..ఆ పర్యవసానంగానే ఒక అమరావతి, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రూపంలో ఒక ఉత్తమ సంస్థ ఇక్కడికి వస్తోందని  చంద్రబాబు వివరించారు.  దురదృష్టమో, అదృష్టమో అర్ధం కావడం లేదని, విభజన బాధాకరమని చెబుతూ స్వాతంత్ర్య రాకముందు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నామని, మన వాళ్లు పోరాడి కర్నూలు రాజధానిగా చేసుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు.  మళ్లీ తెలుగువారంతా ఐక్యతాభావంతో పోరాటం చేస్తే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరు దశాబ్దాలు కష్టపడి మళ్లీ ఇక్కడికి వచ్చామని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజధాని నిర్మాణం చాలా కష్టమన్నారు.
గాంధీనగర్, నయారాయపూర్ లాంటి రాజధానులు పరిశీలించాక అంతకంటే ఉత్తమరాజధాని నిర్మించాలని సంకల్పం తీసుకున్నామని, ప్రవాసాంధ్రులు చూపిస్తున్న చొరవ, ఉత్సాహం చూస్తే వచ్చిన అవకాశాన్ని సద్వినయోగపర్చుకుని ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆధునికంగా, నెంబర్ వన్ గా ఉండాలన సంకల్పం చేశామన్నారు.  రాజధాని అమరావతికి 13 వైద్య కళాశాలలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ లో ఇన్ని మెడికల్ కాలేజీలు లేవన్నారు.  విజయవాడ, గుంటూరులో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎయిమ్స్ పెడుతున్నారని, ఎన్నారై కాలేజీ, కాటూరు, సిద్ధార్ధ, లిమ్రా మైనారిటీ కాలేజీ ఉన్నాయని, సరికొత్తగా ఎస్.ఆర్.ఎం, విట్ వచ్చాయని,బి.ఆర్ షెట్టి, ఇండో-యుకె, అమృత్, ఇప్పుడు అమరావతి-అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.
నేడు అమెరికాలో నలుగురు వైద్యులు ఉంటే ఒకరు భారతీయ సంతతికి చెందినవారని, ప్రతి నలుగురు భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ వారు అని, అది మన ఆస్తి అని అభివర్ణించారు. ఇక్కడ చదువుకుని అమెరికా వెళ్లి అక్కడ సంపాదించి వచ్చి మళ్లీ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారని, జన్మభూమి అభవృద్ధిలో భాగస్వాములవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎఎఐఎంఎస్ చైర్మన్ నవనీత కృష్ణను, భాగస్వాములను అభినందించారు. ‘మీవాళ్లంతా ఇక్కడ చదువుకుని అమెరికా వెళుతున్నారు, ఉత్తమ విద్యార్ధులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇది మీకు నష్టం కదా?’ అని కొందరు తనను ప్రశ్నించగా, తిరిగి వారు ఉత్తమ పరిజ్ఞానం సంపాదించి వస్తారు. డబ్బులతో వస్తారు.’ అని తాను వారికి సమాధానమిచ్చానని, అదే ఈరోజు జరిగిందని  ముఖ్యమంత్రి వివరించారు. అమెరికాలో సముపార్జించిన విజ్ఞానాన్ని, సంపాదించిన కష్టార్జితాన్ని తీసుకుని అద్భుతమైన ఆస్పత్రిని ఇక్కడ నిర్మించేందుకు వచ్చారని ప్రశంసించారు. రాజధాని అమరావతి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఉండాలని తాను అభిలషిస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.  హైదరాబాద్, సికిందరాబాద్ లకు జంటనగరాలుగా గుర్తింపు ఉండేదని,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా తన హయాంలో సైబరాబాద్ నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు.    ఇక్కడ విజయవాడ, గుంటూరు, తెనాలి ఉన్నాయని, తాము నిర్మించబోయేది  గ్రీన్ ఫీల్డ్ సిటీ అని, అందుకే ఇండియాలో ఉండే ఆరోజు ఎంతో దూరదృష్టితో ఆలోచన చేశానని, భవిష్యత్తు ఐటీదేనని గ్రహించి హైదరాబాద్ లో ఐటీరంగాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. ఆ అభివృద్ధి ఫలాలు లక్షలమందికి చేరాయన్నారు. హైటెక్ సిటీ నిర్మించినట్లు, 25 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయని గుర్తు చేశారు.
ఎ.ఎ.ఐ.ఎం.ఎస్ మరో రెండేళ్లలో అంటే..2019 కి 300 బెడ్స్ తో, తర్వాత 400 బెడ్స్ తో ఆస్పత్రి నిర్మాణం దశలవారీగా పూర్తి చేస్తారని, 4 సెంటర్లలో ఒక శాటిలైట్ ఆస్పత్రిని పెట్టుకుని అక్కడి నుంచి రోగులను ప్రధాన ఆస్పత్రికి పంపించే కార్యక్రమం రూపొందించారని చంద్రబాబు  ఏఏఐఐఎంస్ యాజమాన్యానికి కితాబునిచ్చారు.  అమెరికాలో ఉండే విద్యాఫలాలను ఇక్కడికి తెస్తున్నారని, ఉత్తమ పద్ధతులను కూడా తీసుకురావాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో అమెరికా వాళ్లే అమరావతి వచ్చి వైద్యం చేయించుకునే రోజు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం కోసం తాము గ్రామాల్లో, నగరాల్లో అమలు చేస్తున్న వైద్య ఆరోగ్యపథకాలను, ఎన్టీఆర్ వైద్యసేవ, చంద్రన్న బీమా, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ తదితర పథకాలు, సదుపాయాలను ముఖ్యమంత్రి ఉదహరించారు.  రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అమరావతిలో ప్రపంచ స్థాయి బోధనా ఆస్పత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన డా. జి. నవనీత కృష్ణను, ఎన్నారైల బృందాన్ని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.  అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఐటి విప్లవ ఫలాలు ఇంటింటికీ అందించారని ప్రశంసించారు. ఆయన్ని హైటెక్, హైటెక్ అంటూ ఎగతాళి చేశారని, ఐటి విప్లవ ఫలాలు పేద, ధనిక, మధ్య తరగతి తారతమ్యం లేకుండా అన్ని వర్గాల యువత అందుకుందని అన్నారు. ఐటీలో ఎక్కువ వేతనాలు లభిస్తాయన్న విజన్ ఉన్నందువల్లనే నాడు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐటికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని జాస్తి గుర్తు చేశారు.
హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో తన తల్లిగారింట్లో ఒక పనిమనిషి కుమారుడు కాగ్నిస్ టెక్నాలజీస్ లో పనిచేస్తున్నారని, నెలకు రూ.65 వేల వేతనం ఆర్జిస్తున్నాడని తెలిపారు. కుమారుడికి ఉద్యోగం వచ్చినా ఆమె అభిమానంతో ఆ ఇంటనే పనిచేస్తానని ఆమె అన్నప్పుడు కదిలిపోయినట్లు తెలిపారు. కాయకష్టంతో బతికే ఒక పనిమనిషి కుమారుడు మంచి వేతనం పొందగలిగాడని, ఆనాడు ముఖ్యమంత్రి దార్శనికత వల్ల ఇది సాధ్యమైందన్నారు. రెండేళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబాన్ని మర్చిపోయి రాష్ట్రాభివృద్ధికి 17 గంటలదాకా కష్టపడుతున్నారని ప్రశంసించారు. తన ఉద్యోగ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడులా కష్టపడే ముఖ్యమంత్రిని చూడలేదని జాస్తి కృష్ణ కిశోర్ అన్నారు. అభివృద్ధి అనే దొడ్డ వృక్షాన్ని ఆయన పెంచుతున్నారని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఫలాలనిస్తుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణాడెల్టాకు గోదావరి జలాలతో పునరుజ్జీవనాన్ని ప్రసాదించిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు.  అమరావతి అభివృద్ధికి వందల కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన నిస్వార్ధపరుడు, భూదాత మల్లెల పద్మనాభరావు అని కొనియాడారు. ఆయన తన ప్రాంతం, తన గ్రామం అభివృద్ధిని కోరుకుని ఇబ్రహీంపట్నం ప్రాంతానికే పరిమితమయ్యారని దేవినేని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కోరుకుంటే మంత్రి అయి వుండేవారని చెప్పారు. 70 ఎకరాల భూమి వివాదంలో పడ్డప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లకుండా తన ప్రాంతం వారికి ఆ భూమి నివసించడానికి పనికి రావాలని, మెడికల్ కాలేజీ రావాలని అభిలషించాని దేవినేని అన్నారు.
మెట్ట ప్రాంతం అయిన నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, ఇంకా మెట్ట నియోజక వర్గాలైన మైలవరం, తిరువూరు, నూజివీడు,గన్నవరం సహా, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు,గోపాలపురం, చింతలపూడి.. ఇలా తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 7 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను సంవత్సర కాలంలో తీసుకొచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబును  కొనియాడారు. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎఎఐఎంఎస్ చైర్మన్. గొర్రెపాటి  నవనీత కృష్ణ  ఎఎఐఎంస్ స్థాపన ఉద్దేశాలను వివరించారు. జన్మభూమికి సేవచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.  సమావేశంలో భూదాత మల్లెల పద్మనాభరావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ప్రజాప్రతినిధులు, ఎన్నారైలు  పాల్గొన్నారు.

Just In...