Published On: Mon, Apr 5th, 2021

అమర జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

* రూ.30ల‌క్ష‌లు చొప్పున వెంట‌నే అందించాలని సీఎంవో అధికారుల‌కు ఆదేశం

* జవాన్ల మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతి పట్ల ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో మరణించిన రాష్ట్రానికి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాల‌ని సీఎం వైయస్ జగన్ తెలిపారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.

Just In...