Published On: Thu, Jan 9th, 2020

అమ్మఒడి ప‌థ‌కంతో దాదాపు 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి

* విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే

* నాడు-నేడుతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

* ప్రతి పాఠశాల రూపు రేఖలు మారుస్తాం

* తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

* రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా రూ.6,318 కోట్లతో 42,12,186 మంది తల్లులకు దాదాపు 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చడం జరుగుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి బిడ్డ ఎదిగేది అమ్మఒడి లోనే అని, ఆ తల్లి ప్రేమ అనంతం అని, ప్రతి తల్లి తన పిల్లలను బాగా చదివిచాలని ఆశపడుతుందని, పిల్లల చదువులు భారం అవుతున్నాయనే విషయం 3,600 కి.మీ లు సాగిన పాదయాత్రలో ఎంతోమంది తల్లుల ఆవేదన చూడడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమాన్ని నవరత్నాల్లో చేర్చడం జరిగిందని తెలిపారు. ప్రతి విద్యార్థికి చదువే ఆస్తి, సంపద అని, విద్య ప్రాథమిక హక్కు అయినప్పటికీ పిల్లలందరినీ చదివించే స్థోమత లేని పరిస్థితుల్లో ఎంతో మంది తల్లిదండ్రులు కలరని తెలిపారు. పిల్లల కడుపు నిండితేనే వారికి చదువు పై ధ్యాస ఏర్పడుతుందని, పేదింటి పిల్లలు కూడా ప్రపంచంతో పోటీపడి ముందుకు సాగే విధంగా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక మేనమామగా అందరికీ భరోసా ఇస్తున్నానన్నారు. అర్హులుగా ఉండి జగనన్న అమ్మఒడి కార్యక్రమం కింద నమోదు కాని వారు ఫిబ్రవరి 9వ తేది లోపు నమోదుకు వీలుకల్పిస్తున్నట్లు తెలిపారు. మీకు అందుబాటులో ఉన్న గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీ పేర్లను నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాలంటీర్ లను, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల్లో అర్హులైన వారందరికీ ప్రతి ఏటా రూ.15 వేలు వారి తల్లుల ఖాతాల్లోకి జమయ్యే విధంగా ప్రత్యేక బ్యాంకు ఖాతాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం లో 75 శాతం హాజరు లేకపోయినప్పటికీ ఈ పథకం వర్తింప చేయడం జరిగిందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండే విధంగా తల్లిదండ్రులు భాధ్యత తీసుకోవాలన్నారు. అమ్మ ఒడి పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ను ప్రవేశ పెట్టడం జరుగుతుందని ఇందుకు అనుగుణంగా పిల్లలకు బ్రిడ్జ్ కోర్సు, టీచర్ లకు ట్రైనింగ్ మాడ్యూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇంగ్లిష్ మీడియం ఉన్నప్పటికీ తెలుగు తప్పనిసరిగా అభ్యసించవలసి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల జీవితాలు మారే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నాడు – నేడు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలను దశల వారీగా మౌలిక వసతుల కల్పనను కల్పించడం జరుగుతుందని తెలిపారు. మౌలిక వసతుల కల్పనాలో భాగంగా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, త్రాగునీరు, ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ ల్యాబ్స్, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఇలా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సంక్రాంతి నుండి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టి దశల వారీగా 3 సం. లలో అన్ని పాఠశాలలు, కళాశాలల రూపు రేఖలు మార్చడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రుల కమిటీలు ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేశామ‌ని, వీరందరూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మరియు నాడు – నేడు కార్యక్రమం కింద పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన అనంతరం పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, వాచ్ మెన్ ఏర్పాట్ల నిమిత్తం జగనన్న అమ్మఒడి కార్యక్రమం కింద లబ్ధిపొందిన ప్రతి తల్లి వేయి రూపాయలు పాఠశాలకు ఇవ్వడం ద్వారా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావడంతో పాటు ప్రభుత్వం కొత్తగా నిర్మించిన టాయ్ లెట్ల నిర్వహణ ను కూడా నిర్వహించినట్లు అవుతుందని మరియు పాఠశాలకు భద్రత ఉంటుందని, ఆ దిశగా తల్లులు ఆలోచించాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కింద రోజూవారీ అందించే మెనూను మార్పు చేస్తూ విద్యార్థులకు రుచికరమైన పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సోమవారం నుండి శనివారం వరకు విద్యార్థులకు వడ్డించే మెనూనూను ముఖ్యమంత్రి వివరించారు. ఈ కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందజేయుటకు అదనంగా రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని, అయినపట్టికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంతోషం గా భరిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజనం చేసే ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాలను వెయ్యి రూపాయల నుండి రూ.3 వేలకు పెంచడం జరిగిందని, వీరికి ఇచ్చే బిల్లులు కూడా పెండింగ్ లో లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫామ్స్, షూస్, సోక్స్ లు, స్కూల్ బ్యాగ్ సహా అన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి పాఠశాలలో భోదనా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన దేశంలో ఇంటెర్మీడియెట్ తరువాత గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రకారం కేవలం 23 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళుతున్నారని, మిగిలిన 77 శాతం చదువుల జోలికి వెళ్ళడం లేదని, చదువులు భారం కాకూడదనే ఉద్దేశ్యం తోనే ఎస్.సి, ఎస్.టి, బి.సి మైనారిటీ అగ్ర వర్ణాల లోని పేదల జీవితాలలో జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుందని తెలిపారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద సం. కి 20 వేలు హాస్టల్ ఫీజుల నిమిత్తం వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రం లోనూ జగనన్న అమ్మఒడి లాంటి కార్యక్రమం అమలు చేయడం లేదని, విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల భవిష్యత్తు గురించి తపనపడుతున్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు.

  

Just In...