Published On: Tue, May 15th, 2018

అమ్మ ఒడి లాంటి ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పిద్దాం

* నేటి ఉద్యోగులంతా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే

* బట్టీ చదువులకు స్వస్థి చెబుదాం

* ‘మన ఊరు-మనబడి’ బ్రోచర్‌ ఆవిష్క‌ర‌ణ‌లో కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం పిలుపు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నామని కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం తెలిపారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ ముద్రించిన ‘మన ఊరు-మనబడి’ బ్రోచర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్‌లు న‌గ‌రంలోని స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ ఎల్‌.కె.జి. నుండి 10వ తరగతి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలల్లో ప్రతిభావంతులైన, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. బట్టీ పట్టే చదువులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండవని, ఒకటో తరగతి నుండే పోటీ పరీక్షల్లో ఒత్తిడి లేకుండా విజయం సాధించే విద్యను నేర్పించడం జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. నాటి-నేటి ఉద్యోగులంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవారేనని ఈ సంద‌ర్భంగా కలెక్టర్ గుర్తుచేశారు. విశాలమైన ఆటస్థలంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో చ‌క్క‌ని చ‌దువులు ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని పేర్కొన్నారు. నవోదయ, గురుకుల పాఠశాలల ప్రవేశపరీక్షలకు ఉత్తమ శిక్షణ ప్రభుత్వ పాఠశాల నుండే అందిస్తారన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ గ్రామర్‌పై ప్రత్యేక శ్రద్ధ, దృష్టి ఉంటుందని, ప్రతిభా అవార్డుల క్రింద రూ.20వేలు పారితోషికం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. పౌష్టికాహారం, ఏకరూప దస్తులు, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించడంతో పాటు 8, 9 తరగతి బాలికలకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యార్థులతో సృజనాత్మకత, అంకితభావం కలవారు ఉన్నారన్నారు. బాధ్యత గల తల్లిదండ్రులు తమ చిన్నారులను సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. వేలాది రూపాయలు ఫీజులు కట్టనవసరం లేకుండా అన్ని వసతులతో ‘మనబడి’ సిద్ధంగా ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెసి-2 పి.బాబూరావు, డిఆర్ఓ బీఆర్ అంబేడ్క‌ర్, కెడి జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.రాజ్యలక్ష్మీ, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ కెడివిఎం ప్రసాద్ బాబు, ఆర్డీఓలు చక్రపాణి, ఉదయభాస్కర్, సి.హెచ్.రంగయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...