Published On: Sun, Nov 4th, 2018

అమ‌రావ‌తి ఖ్యాతి పెంచేలా ఎఫ్-1, హెచ్-2వో బోట్ రేసింగ్

* విజ‌య‌వంతం చేయాల‌ని కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం పిలుపు

* అద‌ర‌హో అనేలా అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్-2018

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎఫ్-1, హెచ్-2వో బోట్ రేసింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఎఫ్-1, హెచ్2వో ఏర్పాట్లతో పాటు అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్-2018 నిర్వహణపై పున్న‌మీ ఘాట్‌లోని బ‌రంపార్కులో శనివారం టూరిజం రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ ఈ నెల 16, 17, 18 తేదిలలో నిర్వహిస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ బోట్ రేసింగ్‌తో పాటు 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. నూతన రాజధాని అమరావతి ఖ్యాతి పెంచే విధంగా ఆయా కార్యక్రమాలు ఉంటాయన్నారు. పున్నమి ఘాట్ వద్ద 16న మధ్యాహ్నం బోట్ రేసింగ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రారంభిస్తారని అదే విధంగా 18న ముగింపు ఉత్సవాలలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్-2018 ఆంధ్రా ఐడియల్ ఎంపికకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఔత్సాహికులైన సంగీత, నృత్య కళాకారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్ సైట్ www.andhraidol.com ఈ నెల 3వ తేది నుండి నవంబర్ 11వ తేది వరకు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చునన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను రాష్ట్ర స్థాయి కమిటీ వంద మందిని గుర్తించి వీరిలో ముగ్గురిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వీరిని ఫెస్టివల్ కార్యక్రమాలలో దేశ, విదేశాల నుండి వచ్చే సంగీత, నృత్య బృందాలు పాల్గొనే వారితో అవకాశం కల్పిస్తారన్నారు. పోటీలో పాల్గొనే వారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారై ఉండాలన్నారు. ప్రతిభ ఉండి బాహ్య ప్రపంచానికి తమ ప్రతిభను కనబరిచే విధంగా ఈ ఆంధ్రా ఐడియల్లో ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటి అండ్ కల్చరల్ కమీషనర్ సిఈవో విజయభాస్కర్ నేతృత్వంలో పరిశీలన జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం ww.andhraidol.com వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. సిఈవో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధారిటీ హిమాంశు శుక్లా మాట్లాడుతూ అమరావతికి మహోన్నతమైన నృత్య, సంగీత, కళల సాంస్కృతిక వారసత్వం ముందుకు తీసుకువెళ్లడం ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సోదరతత్వం, మానవత్వం వేడుకగా ఈ కార్యక్రమాలు నిలుస్తాయని ఆయ‌న పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మీష‌న‌ర్ జె.నివాస్, డిసిపి వెంకట అప్పలనాయుడు, జేసీ-2 పి.బాబురావు, టూరిజం, ఆర్ అండ్ బి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 

Just In...