Published On: Fri, Jan 24th, 2020

అర్హులు ఎంతమంది ఉన్నా అందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాల్సిందే..

* ఫిబ్రవరి 1 నుంచి ప‌ల్లెబాట‌

* ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్ల‌డి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లపట్టాలపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుక్ర‌వారం సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఇతర అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్లిచ్చే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యమైనది. అర్హులు ఎంతమంది ఉన్నా అందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాల్సిందే. ప్రజాసాధికార సర్వే అన్నది ప్రమాణం కాకూడదు. వాలంటీర్లు, వారు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రామాణికం కావాలి. ఇళ్లపట్టాల కోసం అధికారులు గుర్తిస్తున్న స్థలాలు ఆవాసయోగ్యంగా ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోకూడదు. అందరికీ పట్టాలు ఇవ్వాలి కదా అని… లబ్ధిదారులకు ఉపయోగం లేని చోట ఇవ్వడంలో అర్థం లేదు. ఇళ్లపట్టాలు ఇస్తున్న స్థలాలు పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తంచేయాలి. లబ్ధిదారులకు ఆవాస యోగ్యంగా ఎండాలి. ఈ అంశాలను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఇళ్ల పట్టాల కోసం అసైన్డ్ ల్యాండ్స్‌ను తీసుకోవద్దు. కాకనే కాదు, ఇక ఏమార్గం లేక తప్పదు అనుకుంటే వారికి పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలి. ఇళ్ల పట్టాల కోసం సడలించిన అర్హతల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలని సీఎం ఆదేశం.

ఈ వివరాలన్నింటినీ గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచాలన్న సీఎం ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే.. వారు దరఖాస్తు చేసుకునేలా ఆ సమాచారం గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉండాలి అని సూచించారు. లబ్ధిదారుల అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలన్న సీఎం ఇళ్లపట్టాల కోసం ఎంపికచేసిన స్థలాలపై లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతనే ప్లాటింగ్‌ చేయాలన్నారు. లేకపోతే డబ్బు వృథా అవుతుందని స్పష్టంచేశారు. ఇళ్లపట్టాలకోసం కేటాయించిన స్థలాల్లో చెట్లను కూడా పెంచాలన్న సీఎం మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీల్లో లబ్ధిదారులు అందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలన్నారు. పేదలకు కట్టించే ఇళ్ల డిజైన్‌ బాగుండాలని ఆమేరకు ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంటి స్థలం లేనివారు ఎవ్వరూ ఉండకూడదు అన్నారు. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం కూడా వెంటనే చూపించాలి. వారికి ఇళ్లపట్టాలు ఎక్కడ ఇస్తున్నామో చెప్పాలి. వారికి ఇళ్లు కట్టి, అప్పగించి, వారిని సంతోషపెట్టిన తర్వాతనే వారిని అక్కడనుంచి ఖాళీచేయమని కోరాలి. ఇళ్లపట్టాలు ఇవ్వగానే ఇళ్లు కట్టడానికి, లబ్ధిదారులు అక్కడకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో అధికారులు హడావిడిగా వ్యవహరించడం తగదు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 1 నుంచి నేను గ్రామాల్లో పర్యటిస్తాను అన్నారు. రాండమ్‌గా ఒక పల్లెలోకి వెళ్లి పరిశీలిస్తాను. లబ్ధిదారుల ఎంపిక, పథకాలు అమలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తాను. పొరపాట్లు జరిగితే కచ్చితంగా అధికారులను బాధ్యులను చేస్తాను. ఇళ్లపట్టాల కోసం అధికారులు గుర్తించిన స్థలాల వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలి. అక్కడ ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలి. ప్రజలను సంతోషంగా ఉంచాలి కాని, దాన్ని డ్యూటీగా చూడకూడదు. ఏ ప్రభుత్వం కూడా ఈస్థాయిలో ఇళ్లపట్టాలు ఇవ్వలేదు. అమ్మ ఒడి తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో అతిపెద్ద కార్యక్రమం ఇది అని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.

Just In...