Published On: Wed, Apr 17th, 2019

అల్లర్లు, అరాచకాలకు కారణం వైసిపినే

* ఓటర్లపైనా దాడులు, గవర్నర్‌కు ఫిర్యాదు అర్ధరహితం

* టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు, అరాచకాలకు వైసిపినే కారణమని టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి గ్రామాల్లో ఉధ్రిక్త పరిస్థితులను వైసిపి శ్రేణులు సృష్టిస్తుంటే మరోవైపు ఆ పార్టీ అధినేత జగన్ గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టారు. విజయవాడలోని టిడిపి జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల డబ్బులు పంచుతూ, ఓటర్లపైన దాడులు చేసి తమకే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడటంతో వైసిపి నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పైనా ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనిమెట్లలో దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడి చేయడమే కాకుండా స్పీకర్ కోడెలపై వైసిపి నాయకులు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దాడి ఘటనపై వైసిపి అధినేత ఇప్పటి వరకూ స్పందించకపోగా చొక్కాలు చింపుకున్నారని వ్యాఖ్యానించడం తగదన్నారు. గుడివాడ నియోజకవర్గంలో వైసిపికి ఓటు వేయలేదని ఒక వ్యక్తిపై దాడి చేయడం జరిగిందన్నారు. విజయవాడలో టిడిపి నాయకులు జలీల్‌ఖాన్ వాహనంపై దాడి చేశారన్నారు. ఈ చర్యలు వైసిపి దుష్ట సంస్కృతిని బట్టబయలు చేస్తున్నాయని తెలిపారు.  రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్ధులపైనా వైసిపి శ్రేణులు దాడులకు పాల్పడ్డాయన్నారు. కేసిఆర్, మోడీ మద్దతుతోనే వైసిపి ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. టిడిపి అభ్యర్ధులు, పార్టీ శ్రేణులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాయన్నారు. కేంద్రంతో కలసి కొత్త కుట్రలకు వైసిపి తెరలేపిందన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఏం మేలు చేశారని, వైసిపి గెలిపిస్తారని ఆ పార్టీ నాయకులు కలలు కంటున్నారని ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి వస్తే జగన్ నేర సంస్కృతి మరింత విచ్చలవిడిగా మారుతుందనే ప్రజలు టిడిపిని గెలిపించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మే 23న జరిగే ఓట్ల లెక్కింపులో అత్యధిక సీట్లు సాధించి టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

Just In...