Published On: Sat, Jul 4th, 2020

అల్లూరి కృషిని అందరూ అనుసరించాలి

* పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్

* విద్యాశాఖలో అల్లూరి జయంతి ఉత్సవాలు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: అల్లూరి సీతారామరాజు వంటి మహానీయుణ్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో శనివారం అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ సీతారామరాజు బ్రిటీషు వారిపై వ్యతిరేక ఉద్యమంలో అనుసరించిన వ్యూహాలు, గిరిపుత్రులతో ఆయన మమేకమైన తీరును వివరిస్తూ, మన్యం వాసులకు చేసిన సేవలను, చరిత్రను గుర్తు చేశారు. పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి మాట్లాడుతూ.. బ్రిటీష్ వారిని అల్లూరి ఎదుర్కొన్న తీరును ఆదర్శంగా తీసుకొని, నేటి కాలంలో కొంతమంది ఐఏఎస్‌లు, ఇతర వ్యక్తులు మన్యం వాసులపై దోపిడిని అరికట్టడానికి కృషి చేస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిణి కె.వెట్రిసెల్వి, సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు ఆర్.మధుసూదన రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొని అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Just In...