Published On: Wed, Sep 11th, 2019

అవినీతిని అడ్డుకోవ‌డంతోనే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

* ఇసుక విషయంలో ప్రజలు ఇబ్బందులను ప‌రిష్క‌రించాలి

* ఏ స్ధాయిలో కూడా అవినీతి ఉండకూడదు

* అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు

* ఇసుక విధానంపై స‌మీక్ష‌లో అధికారులకు స్పష్టం చేసిన సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఇసుక విషయంలో చాలామంది రాళ్లేయడానికి చూస్తున్నారని, అవినీతిని అడ్డుకోవడం వల్ల అది సహించలేని వారే ప్రభుత్వంపై రాళ్లు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం ఉద‌యం సచివాలయంలో ఇసుక విధానంపై ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ విమర్శలు రాకుండా చూడాలి, స్టాక్‌యార్డు పాయింట్లు పెంచాలి, వరద తగ్గగానే వెంటనే రీచ్‌ల నుంచి ఇసుకను వీలైనంత త్వరగా  స్టాక్‌ యార్డులకు చేర్చాలి అన్నారు. ఇసుక మాఫియా లేకుండా చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాల‌ని సూచించారు. ఇసుక విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాల‌ని తెలిపారు. ఏ స్ధాయిలో కూడా అవినీతి ఉండకూడదని అధికారులకు స్పష్టం చేసిన సీఎం జ‌గ‌న్ అధికారులు అప్రమత్తంగా ఉండి, ధ్యాస పెట్టాలి అని పేర్కొన్నారు. రవాణా విషయంలో ఇబ్బందులు అధిగమించామా అని అధికారులను ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ ప్రశ్నించారు. వరదల కారణంగా ఇప్పుడున్న సమయాన్ని, పద్ధతులని  సజావుగా సాగేందుకు వినియోగించుకోవాలన్నారు. ఎక్కడెక్కడ ఇసుక కోసం కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాల‌ని, అందుకనుగుణంగా వారు ప్లాన్‌ చేసుకుంటారన్న సీఎం ఎప్పటి నుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని నిర్మాణదారులకు ముందుగా తెలియజేస్తే బాగుంటుంద‌ని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాల‌ని ఆదేశించారు.  

Just In...