Published On: Mon, Nov 5th, 2018

అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల స‌రిహ‌ద్దులో భద్రత క‌ట్టుదిట్టం

* ఏపీ సీఎస్, డిజీపీల‌తో సిఇసి వీడియో కాన్పరెన్సు 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్‌ఘ‌డ్‌, రాజస్థాన్ తదితర ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సక్రమ నిర్వహణకు వాటి సరిహద్దు రాష్ట్రాలతో భద్రతాపరమైన వివిధ అంశాలపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ ఓపి రావత్ మిగతా ఇద్దరు కమీషనర్లతో కలిసి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ మేరకు వారు సోమవారం ఢిల్లీ నుండి ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల సిఎస్, డిజిపి, ముఖ్య ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణకు భద్రత తదితర అంశాలపై సమీక్షించారు. అమరావతి సచివాలయం నుండి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ ఎన్నికలు జరిగే చతీస్‌ఘ‌డ్ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉందని వివరించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉందని ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసమరైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆ సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మావోయిస్టుల నియంత్రణ, మద్యం సరఫరాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని సిఎస్ పునేఠ వివరించారు. వీసీలో పాల్గొన్న రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ చతీస్‌ఘ‌డ్ రాష్ట్రంలోని సుకమ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధితో సరిహద్దును కలిగి ఉందని అది మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమై ఉన్నందున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు విరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, చతీస్‌ఘ‌డ్ రాష్ట్రాలు శాంతి భద్రతలు, ఇతర అంశాలకు సంబంధించి సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో చతీస్‌ఘ‌డ్ సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని డిజిపి ఠాకూర్ కేంద్ర ఎన్నికల కమీషనర్లకు వివరించారు. వీసీలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆర్పి సిసోడియా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ, శాంతి భద్రతల అదనపు డిజిపి హరీస్ కుమార్ గుప్త, ఎక్సైజ్ కమీషనర్ లక్ష్మీ నర్సింహ తదితర అధికారులు పాల్గొన్నారు.

Just In...