Published On: Tue, May 15th, 2018

ఆంధ్రప్రదేశ్ జలసంరక్షణ, ఆస్ట్రేలియా సాంకేతిక సహకారం

* ‘క్రాసస్ క్యాపిటల్’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న జలసంరక్షణ చర్యలకు, ఆస్ట్రేలియా సాంకేతికతతో అదనపు విలువలు జోడించాలని, అత్యధిక ప్రయోజనం పొందేలా ప్రాజెక్టును అమలు చేయాలని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉభయులం కలసి జలసంరక్షణ విధానాన్ని మరింత విస్తృతంగా చేపడదామని ఆయన సూచించారు. దక్షిణ ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న ఆస్ట్రేలియా జలసంరక్షణ విధానాలను ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో  రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పత్రం రాసిచ్చిన  ఆస్ట్రేలియన్ సంస్థ క్రాసస్ క్యాపిటల్ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. క్రాసస్ క్యాపిటల్ సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ సురేశ్ కుమార్ గంగవరపు, విక్టోరియన్ వాటర్ సప్లై ఇండస్ట్రీ అసోసియేషన్ కమర్షియల్ డైరెక్టర్ గంగవరపు సాత్విక్, రిచర్డ్ చోలేవిక్, క్రిస్ ఫీల్‌లు ముఖ్యమంత్రిని కలసిన వారిలో ఉన్నారు. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలని నిశ్చయించారు. ఈ సందర్భంగా ‘క్రాసస్ వాటర్’ పేరుతో క్రాసస్ క్యాపిటల్ సంస్థ ఇచ్చిన ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో తాము చేపట్టిన జలసంరక్షణపైన, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిపై తాము చేసిన అధ్యయన సారంతో  సంస్థ ఇచ్చిన దృశ్య, శ్రవణ ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు వీక్షించారు. పైలెట్ ప్రాజెక్టు తరహాలో క్రాసస్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ జలసంరక్షణను ఆస్ట్రేలియా టెక్నాలజీతో పరిపుష్టం చేయాలని కోరారు. జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షన కాకుండా మరే రంగాల్లో కలసిపనిచేయవచ్చో పరిశీలించాలని కోరారు. తదుపరి సమావేశంలో ఒక అవగాహనకు వద్దామని ముఖ్యమంత్రి అన్నారు.   ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాంఘిక, ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఒక్క టి.ఎం.సి. నీటితో పండించే పంటను జలసంరక్షణతో అర టి.ఎం.సితో పండించవచ్చని క్రాసస్ క్యాపిటల్  ప్రతినిధులు వివరించినప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ వారిని అభినందించారు. కరవు నేలగా గతంలో పేరున్న రాయలసీమలో తాము సూక్ష్మ సేద్య విధానంతో తక్కువ నీటితో పంటలు పండించే విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. వృధాగా వెళ్లే నీటిని శుద్ధిచేసి తిరిగి నేలలో ఇంకిపోయే విధంగా చేస్తున్నామని , ముందస్తు ప్రణాళికతో ఏడాదంతా నీరు లభించే స్మార్టు వాటర్ గ్రిడ్ ను అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో స్మార్టు వాటర్ గ్రిడ్, జల సంరక్షణ పద్ధతులను ఆస్ట్రేలియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
              ఎండుతున్న పంటలకు ఆధునిక సాంకేతికత ఆధారంగా నీరిచ్చి రక్షించవచ్చని నిరూపించామని, కరవును యుద్ధంతో జయించవచ్చని చాటిచెప్పామన్నారు. టెక్నాలజీ సాయంతో తాము భూగర్భ జలమట్టాలు, ఉపరితల నీటి మట్టాల పరిస్థితిని, వాతవారణ పరిస్థితిని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే  నీటిని వృధా చేయకుండా తక్కువ వినియోగంతో ఎక్కువ ప్రయోజనం పొందేలా తాము రూపొందించిన పద్ధతులను క్రాసస్ క్యాపిటల్  ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. పట్టిసీమ నుంచి వచ్చే జలాలతో, సమీప భవిష్యత్తులో పోలవరం నుంచి ప్రవహించనున్న జలాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటే నిర్దేశిత లక్ష్యానికి మించి పొలాలకు సాగునీరందించవచ్చని, ఇంకా 30% నీటివసతి లేని భూమికి నీరిచ్చి అదనంగా సాగులోకి తేవచ్చని వారు క్సాసస్ క్యాపిటల్ ప్రతినిధులు సూచించారు. దక్షిణ ఆస్ట్రేలియాలో 2006-2010 మధ్య ‘మిలీనియం కరవు’పై ప్రజెంటేషన్లో  వివరించారు. ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా ముర్రేనది అతితక్కువ నీరు ప్రవహించిందని, దాదాపు ఎండిపోయి తీవ్రకరవు పరిస్థితి ఏర్పడిందని, సాగునీరు లేక వ్యవసాయం  దెబ్బ తిన్నదని, జల సంరక్షణతో అటువంటి పరిస్థితిని, సవాళ్లను  ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కొందో క్రాసస్ క్యాపిటల్  ప్రతినిధులు వివరించారు. తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన
 డాక్టర్ సురేష్ గంగవరపు కుమారుడు సాత్విక్ గంగవరపు పదేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లారు. క్రాసస్ క్యాపిటల్ ను స్థాపించి జల సంరక్షణపై పౌరుల్లో అవగాహన తీసుకొచ్చారు. తన సొంత జిల్లాను కరవు పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు మద్దతుపలుకుతూ ఆస్ట్రేలియా నుంచి సహకారం అందిస్తున్నారు. ఆయన తిరుపతి సమీపంలోని కమ్మపల్లి గ్రామంలో కొందరు  రైతులను ఎంపిక చేసి వారు వ్యవసాయంలో అధికోత్పత్తి సాధించడానికి చేయూతనివ్వాలని నిశ్చయించారు.
భవిష్యత్తులో కూడా సహకారం అందించండి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జెట్ గ్రౌటింగ్ లో సహకారం ఇప్పడు అందించినట్లే భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులకు సాంకేతిక సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం  తనతో భేటీ అయిన ఆస్ట్రేలియాకు చెందిన కెల్లర్ సంస్థ  ప్రతినిధులకు సూచించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సహకరించేందుకు సీఆర్డీఏతో సంప్రదించి సమన్వయం చేసుకోవాలని కోరారు. పోలవరం, రాజధాని నిర్మాణాల్లో  ప్రపంచంలోనే అత్యుత్తమ పద్ధతులను తీసుకువచ్చి ప్రవేశపెడతామని కెల్లర్ ఏసియా పసిఫిక్  కంపెనీ ప్రతినిధులు గ్రూప్ ఫైనాన్స్ డైరెక్టర్ క్రిస్ వీవర్ (Chris Weaver), డైరెక్టర్ వై. హరికృష్ణ, బిజినెస్ డెవలప్‌మెండ్ డి.జి.ఎం వేలూరి వి.ఎస్. రామదాస్ తదితరులు ముఖ్యమంత్రికి వివరించారు. భూగర్భ ఇంజనీరింగ్ సమస్యలకు  సాంకేతిక పరిష్కారాలను సూచించే సంస్థగా తమ సంస్థకు ఒకటిన్నర శతాబ్దాలకు పైగా చరిత్ర ఉందని వారు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లో 40 దేశాల్లో సంస్థకు కాపదివేల ఉద్యోగులు పనిచేస్తున్నారని, పునాదుల నుంచి కాంక్రీట్ పనులతో చేపట్టే భారీ నిర్మాణాలకు సాంకేతిక సహకారం అందించే కెల్లర్ ఏసియా పసిఫిక్,  కాంక్రీట్ పనుల పటిష్టానికి తగిన కంప్రెషన్ పనులలో (పోస్ట్ టెన్షన్ సిస్టమ్స్) ఎంతో అనుభవం, నైపుణ్యం గడించిందని వారు తెలిపారు.  సి.ఆర్.డి.ఎ.తో భేటీ అయి వివరంగా మాట్లాడి తగిన ప్రణాళికతో రావాలని సీఎం వారిని కోరారు. సమావేశంలో  ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Just In...