ఆంధ్రప్రదేశ్ భౌధ్ధ పర్యాటకానికి సహకరించండి
* శ్రీలంక హై కమీషనర్ ను కోరిన గవర్నర్
సెల్ఐటి న్యూస్, విజయవాడ: శ్రీలంక హై కమీషనర్ ఆస్టిన్ ఫెర్నాండో గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ను రాజ్ భవన్ లో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విశిష్ఠ బౌద్ధ పుణ్య క్షేత్రాల గురించి శ్రీలంక హై కమీషనర్ కు గవర్నర్ వివరించారు. శ్రీలంక మరియు ఆంధ్ర ప్రదేశ్ మధ్య పర్యాటకం అభివృద్ధికి సహకరించవలసినదిగా శ్రీ లంక హై కమీషనర్ ను కోరారు. ఈ మధ్య విజయవాడలో నిర్వహించిన ‘డిప్లొమాటిక్ ఔట్రీచ్’ కార్యక్రమం గురించి కూడా వివరించిన గవర్నర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండవ అతి పెద్ద సముద్ర తీరంతో, పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలమని, సింగల్ విండో పధకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వడం జరుగుతుందని గవర్నర్ శ్రీ హరిచందన్ శ్రీ లంక హై కమీషనర్ కు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్క్ దేశాలలో భారత దేశంతో వ్యాపారం చేసే
దేశాలలో శ్రీ లంక అతి పెద్ద దేశమని శ్రీ లంక హై కమీషనర్ శ్రీ ఆస్టిన్ ఫెర్నాండో గవర్నర్ కు చెప్పారు. అనేక రంగాలలో శ్రీ లంక, భారత దేశాల మధ్య మంచి సంభందాలు కొనసాగుతున్నాయని శ్రీ లంక హై కమీషనర్ చెప్పారు. తమ పూర్వీకుల నుంచి శ్రీ లంక దేశానికి అనేక సందర్భాలలో పర్యటనకు వచ్చినట్లు గవర్నర్ శ్రీ హరిచందన్ శ్రీ లంక హై కమీషనర్ కు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ లంక హై కమీషనర్ శ్రీ ఆస్టిన్ ఫెర్నాండో, గవర్నర్ శ్రీ బిస్వ భూసన్ హరిచందన్ ను మెమెంటోతో సత్కరించారు.