Published On: Tue, Jun 18th, 2019

ఆక్రమణలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం…

* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆంజాద్ బాషా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఆక్రమణలో ఉన్న వక్ఫ్ బోర్డులను ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆంజాద్ బాషా తెలిపారు. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయంలో సోమవారం ఆయన కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి…ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. ముస్లిం సమాజం గర్వపడుతోందని, సీఎంకు తమ సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. ఆయనకు తనపై ఉన్న నమ్మకాని వమ్ము చేయకుండా, తన శాఖలో అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలని సీఎం జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. ఆయన అడుగుల్లో తాము పయనిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగించిన సంక్షేమ పాలనను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. ఇపుడు సీఎం జగన్…తన తండ్రి వైఎస్ కు మించి మంచి పాలన అందిస్తారన్నారు.

వక్ఫ్ బోర్డు బలోపేతం…
రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డును బలోపేతం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా వెల్లడించారు. ఎండోమెంట్ డిపార్టుమెంట్ తరహాలో వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయన్నారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని, వాటి వల్ల వచ్చిన ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తామని ఆయన తెలిపారు.

తొలి సంతకం…రూ.3.36 కోట్ల నిధుల విడుదలపై…
వైఎస్ఆర్ కడప జిల్లాలో మసీదులు, చర్చిల మరమ్మతులు, స్మశాన వాటికల కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి రూ.3.36 కోట్ల నిధులు విడుదల చేసే ఫైల్ పై మంత్రిగా తొలి సంతకం చేసినట్లు డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా తెలిపారు. అంతకుముందు ముస్లిం మతపెద్దల ప్రార్థనల అనంతరం ఆయన కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషాకు పలువురు నాయకులు, అధికారులు, ముస్లిం మత పెద్దలు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Just In...