Published On: Thu, Dec 6th, 2018

ఆటో మొబైల్ రంగంలో మరో ముందడుగు..

* నేడు కియా మోటార్స్‌తో ఎంవోయూ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: నవ్యాంధ్రను ఆటో మొబైల్ హబ్‌గా తీర్చిదిద్ధడంలో భాగంగా మరో ముందడగు పడబోతోంది. కియా కార్ల ఉత్పత్తికి సంబంధించి ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) శుక్రవారం కుదుర్చుకోనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన‌ ఒప్పంద వేడుక ఘనంగా జరగనుంది. అనంతపురం జిల్లా పెనగొండ మండలం, ఎర్రమంచి, గుడిపల్లిలో 587.84 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం అప్పగించడం, పరిశ్రమ నిర్మాణ పనులు పూర్తి కావొస్తుండడం తెలిసిందే. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం గల ప్లాంట్‌ నిర్మాణానికి 1.6 బిలియన్ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడిని కియా యాజమాన్యం పెట్టబోతోంది. 4 వేల మందికి శాశ్వత ప్రాతిపదికన, 7 వేల మందికి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే కియా కార్లు రోడ్డుపైకి వచ్చేలా ఆ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది.
ఆటో హబ్‌గా ఏపీ..
నవ్యాంధ్రను పారిశ్రామిక రంగంలో అగ్రభాగంలో నిలబెట్టేలా సీఎం చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇందుకోసం దేశ విదేశాల్లో తిరుగుతూ పారిశ్రామిక వేత్తలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సమర్థవంతమైన నాయకత్వంపై నమ్మకంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలు రాష్ట్రానికి క్యూ
కడుతున్నాయి. వాటిలో ఆటో మొబైల్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పడానికి
పోటీపడుతున్నాయి. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్, వీర వాహన బస్సు బిల్డింగ్, చిత్తూరులో ఇసూజీ, హీరో మోటార్స్, అమర్ రాజా గ్రూపు, అపోలో టైర్స్, ఆటో కాంపినెంట్ తయారీ యూనిట్లు, నెల్లూరులో భారత్ ఫోర్జ్,
కృష్ణాజిల్లా మల్లవల్లిలో అశోక్ లైలాండ్ తన యూనిట్‌ను నెలకొల్పనుంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట…
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ను నెలకొల్పే దిశగా అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. దీనిలో భాగంగా కాలుష్య నివారణకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగంతో కాలుష్యం వెదజల్లి వాతావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం  చంద్రబాబు నాయుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై దృష్టి సారించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో ఇంధన వినియోగం తగ్గుముఖం పట్టడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు వీలుకలుగుతుంది. కొరియా కంపెనీ అయిన కియా మోటర్స్‌తో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి ఒప్పందం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కియా మోటార్స్ మూడు రకాల విద్యుత్ వినియోగ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. వాటిలో నీరో హైబ్రిడ్, నీరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, ఏ నీరో ఈవీ. ఈ వాహనాలకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలో మీటర్లు ప్రయాణించొచ్చునని కియా మోటార్స్ చెబుతోంది.
రాష్ట్రంలో ఎలక్ర్టిక్ వాహనాల వినియోగం పెంచడానికి విజయవాడలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సెంటర్‌ను ఆ సంస్థ ఏర్పాటు చేయబోతోంది.
సీఎం చంద్రబాబు చొరవ వల్లే రాష్ట్రానికి కియా..
కార్ల రూపకల్పనలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో కియా మోటార్స్ ఒకటి. ఆ దిగ్గజ సంస్థను రాష్ట్రానికి రప్పించడంలో సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఎంతో ఉంది. అయితే వాస్తవానికి ఆ సంస్థ ప్రతినిధుల తొలి ప్రాధాన్యత అనంతపురం కాదు, ఏపీ కూడా కానే కాదు. తమిళనాడులో దీన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ.. అక్కడ రాజకీయ అనిశ్చితి తదితర పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు పునరాలోచనలో పడ్డారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలు వారిని సంప్రదించాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కియా మోటార్స్ యాజమాన్యంతో చర్చిస్తూ, ఏపీలో పారిశ్రామిక రంగానికి అందిస్తున్న ప్రోత్సహాకాలను వివరించారు. తమది సమర్థవంతమైన నాయకత్వం అని అవినీతికి తావులేని పాలన అందిస్తున్నామని తెలిపారు. త్వరితగతిన పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఉన్న నమ్మకంతో కియా మోటార్స్ యాజమాన్యం రాష్ట్రంలో పరిశ్రమ స్థాపనకు ముందుకు రావడం, పనులు ప్రారంభించడం చకచకా జరిగిపోయింది.
ఏపీకి బహుమతిగా 3 మూడు కార్లు…
ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం సందర్భంగా మూడు ఎలక్ట్రిక్ కార్లను బహుమతి ఇవ్వాలని కియా మోటార్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే ఆ కార్లు సచివాలయానికి చేరుకున్నాయి. అవగాహన ఒప్పందం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం వాటిని ప్రారంభించనున్నారు. ఆ కార్లకు ఛార్జింగ్ నిమిత్తం సచివాలయంలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.

Just In...