Published On: Fri, Jan 24th, 2020

ఆది దేవునికి అభిషేకం…!

* పాల నేత్రాలతో దర్శన‌మిచ్చిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు

విజయవాడ – భవానీపురం, సెల్ఐటి న్యూస్‌: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కొలిచిన వారి కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు లక్ష్మీనాధుడు శ్రీ వెంకటేశ్వర స్వామి శుక్రవారం ఉదయం పాల నేత్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు. భవానీపురం పున్నమి ఘాట్‌లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి ఏర్పాటు చేసిన శ్రీ వారి నిత్యోత్సవాలు అత్యంత కన్నుల పండువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారి మూలమూర్తికి అభిషేక సేవ నిర్వహించారు. తిరుమలలో జరిగే విధంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు. పంచామృతాలతో స్వామి వారికి అభిషేకం జరిగింది. నిత్యం అలంకారశోభితుడైన ఉండే నీలమేఘ  శ్యాముడిని నిజరూప దర్శనంలో పాలతో అభిషేకించగా స్వామి వారి కళ్ళు పాల నేత్రాలతో ప్రకాశిస్తూ కనిపించాయి. భక్తులు తన్మయత్వంలో కళ్ళు రెప్ప అర్పకుండా గోవింద నామస్మరణ చేస్తూ  స్వామివారిని సేవించారు. పాలు, తేనె, పెరుగు, కొబ్బరి నీరు, పంచదార వంటి పంచామృతాలతో మూలమూర్తికి అభిషేకం జరిగింది. నిలువెత్తు స్వామి వారిని నిజరూపంలో గంధంతో అలంకరించగా వక్షస్థలంపై ఉభయదేవేరులతో అత్యంత సుందరంగా, శోభాయమానంగా వెలిగిపోయారు. రెండు కన్నులు చాలవు అన్నట్లుగా భక్తులు అభిషేక సేవలో  స్వామి వారిని  దర్శించుకున్నారు. తులసీదళాలు, పట్టు వస్త్రాలతో దేవదేవుడిని ముస్తాబు చేసి అలంకరించి హారతులు ఇచ్చారు. అభిషేక సేవలో దేవదేవుడిని దర్శించుకుంటే, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. తిరుమలలో జరిగే వారాంతపు సేవల్లో శుక్రవారం నాడు నిర్వహించే అభిషేక సేవకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళుతుంటారు. అలాంటి సేవని ఇక్కడ పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తజనం తరలి వచ్చి అభిషేక సేవలో స్వామివారి  దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. విజయవాడ నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులు అభిషేక సేవలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం తోమాలసేవ, విశ్వరూప దర్శనం, కొలువు సహస్రనామార్చన  సేవలు నిర్వహించారు. యాగశాలలో మహా శాంతి హోమం జరిగింది. శుక్రవారం అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. బాలాజీ స్వీట్స్ అధినేత శ్రీనివాస్, వెగా జువెలర్స్ అధినేత నవీన్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ మంచినీరు, పండ్లు పంపిణీ చేశారు. కల్యాణోత్సవంలో స్వామివారికి నివేదనగా ఏర్పాటుచేసిన లడ్డూ ప్రసాదాన్ని నిత్యం ఇక్కడ సేవ చేసే సభ్యుడు రంగా శ్రీనివాస్ వేలంలో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని  కానుకగా  దక్కించుకున్నారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ప్రతిరోజూ ఇక్కడ కళ్యాణ  మండపంలో ఉభయ దేవేరులతో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.  శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
తాళ్ళపాక అన్నమాచార్య కళావేదికపై సూర్య భగవానుని శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్టించి ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాంచ భౌతికమైన ఈ శరీరం ఆత్మజ్ఞానంతో మెలిగితే మనిషి  దీర్ఘాయుష్షుతో, సుఖ సంతోషాలతో జీవిస్తారని, అందుకు ప్రతి ఒక్కరూ సూర్యభగవానుని పంచభూతాలను పూజించాలని పండితులు జక్కేపల్లి జగన్నాధరావు భక్తులకు వివరించారు. శుక్రవారం అమావాస్య సందర్భంగా అన్నమాచార్య కళావేదిక దగ్గర ఉచితముగా మహిళలచే సామూహికంగా పంచాయుధారాధన సహిత కోటి కుంకుమార్చన పూజ ఏర్పాటు చేశారు. ఈ పూజలో సుమారు ఐదు వేల మంది మహిళలు పాల్గొన్నారు. కోటి కుంకుమార్చన పూజకు మహిళలు అశేష జనవాహినిగా తరలిరావడంతో పున్నమి ఘాట్ పరిసర ప్రాంతం ఇసుకవేస్తే రాలని రీతిలో కోలాహలంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుంకుమ పూజ లో పాల్గొన్న వారందరికీ ఉచితంగా పూజా ద్రవ్యాన్ని ఏర్పాటు చేశారు. ముందుగానే వారికి కేటాయించిన సీట్లలో కూర్చునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి ( గాడ్) కోటి కుంకుమార్చన పూజలో పాల్గొన్న భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. కుంకుమార్చనతో పాటు సహస్ర దీపాలంకరణ సేవ కూడా వైభవంగా నిర్వహించారు. అనంతరం గజవాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి మాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వేలాది మంది భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. నిర్వాహకులు గరిమెళ్ళ నారాయణ చౌదరి (నాని), ధూపగుంట్ల శ్రీనివాస్, మామిడి లక్ష్మీ వెంకట శ్రీనివాస్, ఉదయగిరి శ్రీనివాస్ బాబు, దర్శి కృష్ణారావు, పోకూరి బాలగంగాధర్, చింతలపూడి రఘురాం, మాజేటి వెంకట దుర్గాప్రసాద్, కుందేపు మురళీకృష్ణ, మాజేటి సాంబశివరావు, పులిపాటి సాంబశివరావు, గార్లపాటి లీలా మల్లికార్జునరావు, పట్నాల నరసింహారావు సభ్యులు భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. మాఘ‌మాసం తొలి శనివారం, శ్రవణా నక్షత్రం కావడంతో స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు (అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి, మైసూర్) శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారిచే అనుగ్రహ భాషణం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే వేదికపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

   

Just In...