Published On: Mon, Nov 4th, 2019

ఆధునిక డిజైన్లతో ఆకట్టుకుంటున్నశిల్పారామం చేనేత వస్త్ర ప్రదర్శన

* విజ‌య‌వాడ‌లో రెండుచోట్ల వస్త్ర ప్రదర్శనలు

* శిల్పారామం సిఈవో బి.జైరాజ్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: విజయవాడలోని కృష్ణా రైస్ మిల్లర్స్ అసోషియేషన్ హాలులో అక్టోబ‌రు 30వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శిల్పారామం చేనేత వస్త్ర ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కళాకారులు అధునాతన డిజైన్లతో రూపొందించిన చేనేత వస్త్రాలను ప్రదర్శించి అమ్మకాలను నిర్వహిస్తున్నారు. ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉత్పత్తిదారులే నేరుగా అమ్మకాలను నిర్వహించటం వల్ల మార్కెట్ రేటుకంటే అతితక్కువ ధరకే వస్త్రాలు అందుబాటులో లభిస్తున్నాయి. ముఖ్యంగా అధునాతన డిజైన్లతో రూపొందించిన ఉప్పాడ, ధర్మవరం పోచంపల్లి, కుప్పడం, వెంకటగిరి జరీ చీరలు సందర్శకులను ఆకర్శించటం వల్ల అమ్మకాలు ఊపందుకొన్నట్లు నేత కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు చీరాల, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ శ్రీకాకుళం ఖాదీ, కళాంకారీ వస్త్రాలు వంటి ఇతర చేనేత వస్త్రాలు ప్రదర్శనలో ఉంచడం జరిగింది. నేత కార్మికులకు గిట్టుబాటు ధర కల్పించి వాటిని ప్రోత్సహించేందుకు కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో శిల్పారామం వస్త్ర ప్రదర్శనను న‌వంబ‌రు 12వ తేదీ వరకు నిర్వహించటం జరుగతుందన్నారు. ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. వస్త్రాభిమానులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల సందర్భంగా మూడో తేదీ వరకు ప్రత్యేక వస్త్ర ప్రదర్శ‌నను ఏర్పాటు చేసినట్టు శిల్పారామం సీఈవో బి.జైరాజ్, కేంద్ర వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగారావులు తెలిపారు.

Just In...