Published On: Sat, Apr 4th, 2020

ఆప‌న్నుల‌కు అండ‌గా అందుబాటులో 104, 1902 టోల్ ఫ్రీ నెంబర్లు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: కరోనా మహమ్మారి నేపధ్యంలో ఆపన్నులకు అదృష్ట సంఖ్యలుగా 104, 1902 టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయని సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాపై ప్రభుత్వానికి సమాచారం అందించటంలో పౌరులు తమ బాధ్యతగా గుర్తించి 104 కాల్ సెంటర్ ను వినియోగించుకోవాలని,కరోనా అనుమానిత లక్షణాలు ఎవరికైనా ఉన్నా వారుగాని, చుట్టుపక్కల వారుగాని 104 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు వారికి కావాల్సిన వైద్యసదుపాయం వివరాలు, పరీక్షా కేంద్రాల వివరాలు అడిగితే వారికి సమాచారం అందించటం జరుగుతుందని, వచ్చిన వారిని ఇళ్లల్లోనే ఉండేలా, 14 రోజులు క్యారంటైన్ పాటించేలా తెలియజేస్తూ వారికి కరోనా తీవ్రత వివరించడం జరుగుతుందన్నారు. క్వారంటైన్ లో వారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండేలా సూచనలు ఇవ్వడం తో పాటు ఆ సూచనలు పాటిస్తున్నారోలేదో ఫాలోఅప్ చేయడమూ జరుగుతుందన్నారు. వేలాదిమంది తెలుగువారు అమెరికా, జర్మనీ, చైనా, ఇటలీ, స్పెయిన్‌, ఇరాక్‌, సౌత్‌ కొరియా, జపాన్‌ తదితర దేశాల నుంచి వచ్చిన వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతున్నామన్నారు. కరోనా పై గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు రెండు సర్వేలు నిర్వహించామని తాజాగా మూడో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ సర్వేను ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌, పీహెచ్‌సీ డాక్టర్లతో చేయించటం జరుగుతోందన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనబడితే 104 కాల్‌ సెంటర్ కు కాల్ చేయమని సూచిస్తున్నామన్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 104 ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో పనిచేస్తుందని,104 కాల్ సెంటర్ కు ఎక్కువగా వ్యాధి లక్షణాలు, జాగ్రత్తలు పై కాల్స్ వస్తున్నాయన్నారు. కరోనా వల్ల ఆక్వా పరిశ్రమ, రైతులకు కూలిపనులు చేయడంలో ఎదురయ్యే కూలీల సమస్యలకు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, పంట అమ్మే సమయంలో దళారీల నుంచి కాపాడేందుకు, పంటలను మార్కెట్ యార్డ్ లకు తరలించడంలో సరైన రవాణా లేకపోవడం తదితర సమస్యలకు 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతుల పంటలను కాపాడటం, పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవడం, ఆక్వా పంట అమ్ముకోవటంలో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు రైతులు తెలియజేయొచ్చు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పింఛన్లు, రేషన్ సరుకులు, కరోనా సాయంగా ప్రతి పేద కుటుంబానికి అందిస్తున్న 1,000 రూపాయల సాయం పై ఏమైనా ఇబ్బందుల పై వచ్చినా తెలపాలన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తెలియజేసిన సమస్యలను సంబంధిత విభాగాలకు తెలియజేసి పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటనలో తెలియజేశారు.

Just In...