ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలందాలి
* ఆ ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్యమిత్రలను నియమించాలి
* ఆస్పత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు గ్రేడింగ్ ఇవ్వాలి
* 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలి
* కోవిడ్–19 పై సమీక్షలో సీఎం వైయస్ జగన్ ఆదేశం
అమరావతి, సెల్ఐటి న్యూస్: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అత్యంత నాణ్యతతో కూడిన వైద్య సేవలందాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్–19 నివారణ చర్యలపై క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం వైయస్ జగన్ సమీక్ష జరిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
ఆరోగ్యమిత్రలు…
అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యమిత్రల (హెల్ప్‌డెస్క్)ను నియమించారా? వారెలా పని చేస్తున్నారన్నది అధికారులు చూడాలి. ఒక రోగి ఆస్పత్రికి రాగానే ఆరోగ్యమిత్రలు వారి సమస్య తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలో సూచించాలి. ఆ ఏర్పాట్లు చేయాలి. ఆరోగ్య మిత్రలు తప్పనిసరిగా ప్రొటోకాల్ ప్రకారం పని చేయాలి. ఒక ఆస్పత్రిలో రోగి చికిత్సకు తగిన వైద్య సదుపాయాలు లేకపోతే, ఏ ఆస్పత్రిలో ఆ సదుపాయాలు ఉన్నాయన్నది ఆరోగ్యమిత్ర చూడాలి. అక్కడి వారితో మాట్లాడాలి. వైద్యులతో కూడా మాట్లాడాలి. ఆ విధంగా రోగిని అక్కడికి వారే స్వయంగా పంపించాలి. ఆ ఆస్పత్రిలో చేర్పించాలి. రోగికి అవసరమైన వైద్యం అందుతుందా? లేదా? అన్నది చాలా ముఖ్యం. అది మనం ఆరోగ్యశ్రీ పథకం నుంచి
ఆశిస్తున్నాం. ఆరోగ్యమిత్రల పని ఆ విధంగా ఉండాలి.
ఆరు ప్రమాణాలు…
ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, ఆహారం, శానిటేషన్, ఆరోగ్యమిత్ర (హెల్ప్‌డెస్క్).. ఈ ఆరు ప్రమాణాలు అన్ని ఆస్పత్రుల్లో ఉండాలి. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నింటిలో ఆ ప్రమాణాలు ఉండి తీరాలి. అదే విధంగా కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా నాణ్యతతో కూడిన వైద్యం, వైద్య సదుపాయాలు, మంచి ఆహారం, శానిటేషన్ తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ ప్రమాణాలు పాటించని ఆస్పత్రులకు కొంత సమయం ఇవ్వాలి. అప్పుడు కూడా అవి మారకపోతే ఆ తర్వాత ప్యానెల్ నుంచి తొలగించాలి.
104 కాల్ సెంటర్…
తమకు కోవిడ్ సోకిందని ఎవరైనా భావిస్తే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలన్నది అందరికీ తెలియాలి. అందుకు ఇప్పుడు మనకు 104 కాల్ సెంటర్ ఉంది. ఆ సర్వీస్ చాలా బాగా పని చేయాలి. అందుకే తప్పనిసరిగా రోజూ మాక్ కాల్స్ చేయాలి. ఫోన్ చేసిన అర గంటలో బెడ్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా 104 కాల్ సెంటర్ పని చేయాలి. 104 కాల్ సెంటర్ సమర్థంగా పనిచేయాలి. నాణ్యతతో కూడిన సేవలందించాలి.
హోం ఐసొలేషన్…
హోం ఐసొలేషన్‌లో ఉన్న వారితో ఏఎన్ఎంలు టచ్‌లో ఉండాలి, వారికి తప్పనిసరిగా మెడికల్ కిట్ అందించాలి. వైద్యులు కూడా వారితో టచ్‌లో ఉండి మెరుగైన సేవలందించాలి. వచ్చే 15 రోజుల్లో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కూడా వైద్య సేవల ఆధారంగా గ్రేడింగ్ జరగాలి. అదే విధంగా ఆరోగ్యమిత్రల ఏర్పాటు. వారి సేవలను కూడా బేరీజు వేసి గ్రేడింగ్ ఇవ్వాలి. ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించకపోతే, వాటిని ప్యానల్ నుంచి తొలగిస్తామన్న మెసేజ్ వెళ్లాలి. ఐవీఆర్ఎస్ ద్వారా పొందుతున్న ఫీడ్ బ్యాక్, డేటా మేరకు, ఆ తర్వాత వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది చాలా ముఖ్యం అని సీఎం శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పడుతోందని, పాజిటివిటీ, మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిందని సమావేశంలో అధికారులు వివరించారు. కరోనా టెస్టుల్లో రాష్ట్రం ఇవాళ దేశంలోనే అత్యధిక సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 35,680, ట్రూనాట్ టెస్టులు 8,890 స్థాయికి చేరాయి. ఇది దేశంలోనే మొదటి స్థానం. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో రోజూ దాదాపు 70 వేల పరీక్షలు చేస్తుండగా, వాటిలో ఆర్టీపీసీఆర్ 50 శాతం ఉన్నాయి. వాటి సంఖ్య ఇంకా పెంచి 50 వేల పరీక్షలు చేయాలని నిర్ణయించాం. 24 గంటల్లోనే పరీక్షల ఫలితాలు కూడా ప్రకటిస్తున్నాం. శాంపిళ్ల సేకరణకు 135 బస్సులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.
కోవిడ్ ఆస్పత్రులు–వైద్య సదుపాయాలు…
రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 252 ఆస్పత్రుల్లో 38,042 బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ చికిత్స కోసం ఒకప్పుడు కేవలం 250 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా 5 వేల వెంటిలేటర్లు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్‌కు ముందు ఆక్సీజన్ సరఫరా కలిగిన బెడ్లు కేవలం 3636 మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 28,790. దాదాపు అన్ని ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీ జరుగుతోంది. ప్లాస్మా దాతలకు రూ.5 వేలు ప్రోత్సాహకంగా ఇస్తున్నాము.
ఆస్పత్రులు–సిబ్బంది..
అన్ని చోట్లా మెరుగైన వైద్య సేవలందించేలా 10 వేల సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించగా, తాత్కాలికంగా 20 వేల మందిని నియమించడం జరిగింది. ఫోన్ చేసిన 30 నిమిషాల్లోనే బెడ్ కేటాయించడం జరుగుతోంది. కోవిడ్ రోగుల తరలింపు కోసం 108 సర్వీసులతో పాటు, 393 అంబులెన్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో ఇప్పటి వరకు 63,49,953 కోవిడ్ పరీక్షలు చేశారు. ప్రతి 10 లక్షల మందిలో 1,18,913 పరీక్షలు చేయగా, పాజిటివిటీ 11.65 శాతంగా ఉంది. ఇప్పటి వరకు క్యుములేటివ్ కేసులు 7,39,719 కాగా, ప్రతి 10 లక్షల మందిలో 13,852 కేసులు క్యుములేటివ్‌గా నమోదయ్యాయి. రికవరీ రేటు 92.59 శాతం కాగా, మరణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు కేవలం 0.83 మాత్రమే. అన్ని జిల్లాలలో మరణాల సంఖ్య కూడా తగ్గింది. రాష్ట్రంలో 252 కోవిడ్ ఆస్పత్రులకు గానూ ఇప్పుడు 217 మాత్రమే వినియోగించడం జరిగింది. ఆ ఆస్పత్రులలో మొత్తం 35,210 బెడ్లు ఉండగా,
వాటిలో 13,488 మాత్రమే ఆక్యుపైడ్. కోవిడ్ ఆస్పత్రుల్లో 13,488 మంది చికిత్స పొందుతుండగా, కోవిడ్ కేర్ ఆస్పత్రుల్లో 8,576, హోం ఐసొలేషన్‌లో 26,597 మంది ఉన్నారు.
వైద్య నిపుణులు…
వివిధ ఆస్పత్రుల్లో (డీఎంఈ, ఏపీవీవీపీ, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) వైద్య నిపుణులకు సంబంధించి 2120 పోస్టులు మంజూరు అయ్యాయి. వాటిలో ఇప్పటి వరకు 1,116 పోస్టులు భర్తీ జరిగింది. మరో 1004 పోస్టుల
భర్తీ ప్రాసెస్‌లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇప్పుడు 4,60,099 ఎన్–95 మాస్కులు, 8,76,825 పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు 20.5 లక్షల ఎన్–95 మాస్కులు, 24.5 లక్షల పీపీఈ కిట్లు జిల్లాలకు పంపించడం జరిగింది.