Published On: Fri, Jan 8th, 2021

ఆల‌యాల పునఃనిర్మాణానికి సీఎం జ‌గ‌న్ భూమిపూజ‌

* ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న మ‌ఖ్య‌మంత్రి

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: గత ప్రభుత్వం హ‌యాంలో విజయవాడ నగరంలో కూల్చివేసిన తొమ్మిది గుడులకు సంబంధించి పునఃనిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి కృష్ణా తీరంలో సీతమ్మ పాదాల వద్ద శుక్ర‌వారం భూమిపూజ నిర్వహించారు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ది, విస్తరణలో భాగంగా రూ.77 కోట్లతో చేపట్టిన మరో ఎనిమిది పనులకు కూడా సీఎం  జగన్‌ భూమిపూజ చేశారు. శనీశ్వరస్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో రెండు వేర్వేరు శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వేద పండితులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం ముఖ్య‌మంత్రికి ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి జ్ఞాపిక, చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో దేవాదాయ శాఖ రూపొందించిన క్యాలెండర్‌తో పాటు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానం క్యాలెండర్‌ను కూడా సీఎం జగన్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, దుర్గ‌గుడి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Just In...