Published On: Mon, Apr 16th, 2018

ఆ విలన్‌ని బాది బొక్కలో పెడతాం

* విజ‌య‌వాడ పాద‌యాత్ర‌లో వైఎస్ జగన్ వ్యాఖ్య‌లు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ పొలిటిక‌ల్ డెస్క్‌: అదిగో ఇంద్రలోకం… ఇదిగో మాయాబజార్‌.. అంటూ గడిచిన నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు సినిమా చూపిస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. బాబు చూపిస్తున్న ఆ లైవ్‌ సినిమా పేరు ‘‘ఓభ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ’’ అని, సినిమా అంతా ఉత్తమ విలన్‌, ఆయన గ్యాంగే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ఆ అన్యాయాలకు చరమగీతం గీతం పాడే రోజు తప్పక వస్తుందని, హీరో ఎంటరైతే.. విలన్‌ని బాది బొక్కలోవేయడం తథ్యమని తెలిపారు. 137వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విజయవాడలోని చిట్టినగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడారు. ‘ఓభ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ’ సినిమా ఇదే: నాలుగేళ్ల కిందట మొదలైన సినిమా ప్రదర్శన ఇప్పటికీ కొనసాగుతున్నదని, అనేక మోసాలు, భారీ ఎత్తున ముడుపులు, బినామీలకు వరాలు ఒకవైపైతే, స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల నోట్లో మట్టికొట్టడం మరోవైపు చూడొచ్చని జగన్‌ అన్నారు. ‘‘ బాబుగారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైందీ సినిమా. రాజధాని నూజివీడులో వస్తుందని, నాగార్జున యూనివర్సిటీ దగ్గరని, ఆ తర్వాత ఏలూరు రోడ్డులో అని రకరకాల లీకులిచ్చారు. అయితే చంద్రబాబు స్కెచ్‌ గీసింది మాత్రం వేరు.. ముందస్తుగానే తాను, తన బినామీలతో రాజధాని చుట్టుపక్కల భూములను కొనుగోలుచేశారు. ఆ వ్యవహారం పూర్తయిన తర్వాతే రాజధానిని ప్రకటించారు. అలా రైతుల్ని మోసం చేసి, ఇన్‌సైడెడ్‌ ట్రేడింగ్‌ చేసిన చంద్రబాబును బొక్కలో పెట్టి బాదాలా వద్దా? రాజ్యాంగ రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేసిన ఆయనే బినామీలతో భూములు కొనిపించాడు. ఆ తర్వాత ల్యాండ్‌ పూలింగ్‌ లో బినామీల్లో చాలా మంది భూముల్ని బయటేసి, కొందరివి మాత్రం తీసుకున్నాడు.. వాటిని కూడా బిజినెస్‌ జోన్‌లోకి తీసుకొచ్చి, సాధారణ రైతుల భూములను మాత్రం ఫార్మింగ్‌ జోన్‌లో పెట్టి అన్యాయం చేశాడు. భూములు ఇవ్వని రైతులను నానా హింసలు పెట్టాడు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే.. వీళ్లు రాజధానికి వ్యతిరేకం అని బురదజల్లుతాడు. అంతేనా, భూములివ్వకుండా పంటలు వేసుకుంటే, ఆ పంటల్ని తగలబెట్టాడు. అరటితోటల్ని నరికేయించాడు. పోలీస్‌ స్టేషన్లలో భూ సెటిల్మెంట్లు చేయించాడు. చివరికి అసైన్డ్‌ భూములు, లంక భూములనూ వదల్లేదు. పేదవాడి భూమి జోలికి పోతే పాపం తగుతులుందని అనుకుంటారు.. కానీ చంద్రబాబు రాక్షసుడు, దెయ్యం కాబట్టి వాటినీ అడ్డగోలుగా దోచేశాడు. అతటితో సినిమా అయిపోలేద‌ని.. నాలుగేళ్లలో 23 సార్లు విదేశీ పర్యటనలు.. సింగపూర్‌, దుబాయ్‌, అమెరికా, జపాన్‌… ఏ దేశానికి అమరావతిని అలా కడతానంటాడు. పిట్టలదొరమాదిరి అంతులేని మాటలు చెబుతాడు. ఇదంతా ఏమిటంటే.. రాజధాని భూములను తనకు నచ్చినవాళ్లకు, నచ్చిన రేటుకు అమ్ముకుందామని చేస్తున్న కుట్ర మాత్రమే. నాలుగేళ్లలో శాశ్వత నిర్మాణం ఒక్కటీ లేదు. తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్‌లకోసం ఒక్క అడుగు స్థాలానికి 10 వేల రూపాయలు ఖర్చుపెట్టారు. అసలు రాజధాని కట్టే ఉద్దేశమే ఈ విలన్‌కి ఉంటే.. అంతకంటే తక్కువ ఖర్చుతో శాశ్వత నిర్మాణాలే కట్టేవాడు. ఇంకోసారేమో బాహుబలి సినిమాకి పోయి సెట్లు బాగున్నాయని ఆ డైరెక్టర్ను పిలిపిస్తాడు. రాజధాని కట్టే ఉద్దేశం ఉంటే చంద్రబాబు తన ఇంద్రభవనాన్ని హైదరాబాద్‌లో కాకుండా ఇక్కడే కట్టుకునేవాడు కదా! రైతుల్ని మభ్యపెట్టడానికి ఫ్లాట్లు ఇస్తానంటాడు. అక్కడ కరెంటు, నీళ్లు, రోడ్లు ఏవీ ఉండవు. అదిగో నీ ఫ్లాటు అని ఎడారిని చూపిస్తాడు. ఇదీ నాలుగేళ్లుగా నడుస్తోన్న ‘ ఓ భ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ..’ సినిమా. ఈ కథలో హీరో లేరు. ఉన్నదంతా ఉత్తమ విలనే. హీరో వచ్చాడంటే.. విలన్‌ని తన్ని బొక్కలో వేయడం ఖాయం’’ అని వైఎస్‌ జగన్ వ్యాఖ్యానించారు.

Just In...