Published On: Mon, May 27th, 2019

ఇంకా వారం దాకా వ‌డ‌గాల్పులే!

* 47 డిగ్రీలు దాట‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు

* గాలిలో తేమ‌శాతం ప‌డిపోవ‌డ‌మే కార‌ణం

* ప‌లు జిల్లాల్లో తీవ్ర‌స్థాయిలో వ‌డ‌గాల్పులు

* ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి

* ఎండ‌ల్లో తిర‌గ‌కుండా నీడ‌పాటునుండాలి

* ఆర్టీజీఎస్ వాతావ‌ర‌ణ నిపుణ‌ల హెచ్చ‌రిక‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో మ‌రో వారం రోజుల‌కుపైగా వ‌డ‌గాల్పులు వీచే అవ‌కాశాలున్నాయి. ఈ మేర‌కు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ప్ర‌జ‌ల‌కు సోమ‌వారం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  గాలిలో తేమ శాతం గ‌ణ‌నీయంగా ప‌డిపోవ‌డంతో  ఉష్ణోగ్ర‌త‌లు పెరిగి, వేడిగాలుల తీవ్రత పెరిగింద‌ని ఆర్టీజీఎస్‌కు చెంది అవేర్ విభాగం నిపుణులు తెలిపారు. ప్ర‌కాశం, క‌డ‌ప‌, క‌ర్నూలు, కోస్తాంధ్ర జిల్లాల్లో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటాయ‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త‌లు 47 డిగ్రీలు తాకే సూచ‌న‌లున్నాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు తెలిపారు. గుంటూరు జిల్లా దాచేప‌ల్లి, మాచ‌వ‌రం మండ‌లాల్లో 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్నాయి. అలాగే ప్ర‌కాశం జిల్లా అద్దంకి, బ‌ల్లికురువ‌, ముండ్ల‌మూరు, కృష్ణా జిల్లాలోని జ‌గ్గ‌య్య‌పేట‌, వ‌త్స‌వాయి, పెనుగంచిప్రోలు మండ‌లాల్లోనూ ఇదే త‌ర‌హా ఉష్ణోగ్ర‌త‌లు నమోద‌య్యే సూచ‌న‌లు ఉన్నాయి.  రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. ప్ర‌జ‌లు ప‌గ‌టి పూట ఎండ‌ల్లో తిర‌గ‌కుండా, నీడ‌పాటున‌, చ‌ల్ల‌టి ప్ర‌దేశాల్లోనే ఎక్కువ‌గా సేద‌దీరాల‌ని తెలిపారు. వృద్ధులు, చిన్న‌పిల్ల‌ల ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.   సోమ‌వారం చిత్తూరు జిల్లాలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.  జిల్లాలోని విజ‌య‌పురం మండ‌లంలో అత్య‌ధికంగా 46.02 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌, న‌గిరిలో 46.00, వ‌డ‌మాల‌పేట‌లో 45.83 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలోని 21 ప్రాంతాల్లో 44 నుండి 47 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైతే, 140 ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

Just In...