Published On: Sat, Jan 5th, 2019

ఇంజనీరింగ్ విద్యార్థులకు రొబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగంలో శిక్ష‌ణ‌

   సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు రొబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగంలో ఈ నెల రెండో వారం నుంచి తొలి విడత శిక్షణను ప్రారంభిస్తున్నట్టు ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి & సీఈవో డాక్టర్ కృతిక శుక్ల తెలిపారు. మొత్తం 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్(ఈసీఎం) మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో మెకట్రానిక్స్, రొబోటిక్స్ విభాగంలో అడ్వాన్సుడ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 1.0, అడ్వాన్సుడ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 2.0, అడ్వాన్సుడ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 3.0 కోర్పుల్లో శిక్షణ ఇస్తారు. జర్మనీకి చెందిన రెండు ఐగూస్ రొబోలను ఒక్కో ల్యాబ్‌లో అందుబాటులో ఉంచి విద్యార్థులకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని కృతిక శుక్ల తెలిపారు. తొలి విడతగా యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ సంస్థ రాష్ట్రంలోని 11 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన 24 మంది ఫ్యాకల్టీలను జర్మనీకి తీసుకెళ్లి 10 రోజులపాటు రొబోటిక్స్ మరియు మెకట్రానిక్స్ విభాగాల్లో జర్మనీకి చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారని కృతిక శుక్ల తెలిపారు. శిక్షణలో భాగంగా ఆడీ కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. మరోవైపు తొలివిడత శిక్షణ కోసం 5 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2419 మందికి ప్రాథమిక పరీక్ష నిర్వహించి 900 మందిని శిక్షణ కోసం ఎంపిక చేసుకున్నారు. వీరందరికి 11 ఇంజనీరింగ్ కాలేజీల్లో జనవరి రెండో వారంలో శిక్షణను ప్రారంభిస్తున్నట్టు కృతిక శుక్ల తెలిపారు. రెండో విడతలో ఎక్కువమంది విద్యార్థులకు ఈ శిక్షణను అందుబాటులోకి తీసుకురావాలనే ల‌క్ష్యంతో 29 ఇంజనీరింగ్ కాలేజీల్లో శిక్షణ ఇవ్వాలని ఎపిఎస్‌ఎస్‌డిసి నిర్ణయించిందని తెలిపారు. ఆసక్తి గల ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు http://engineering.apssdc.in/ecm వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కృతికా శుక్లా చెప్పారు. ఈ  నెలాఖరు కల్లా జర్మనీ నుంచి శిక్షణకు అవసరమైన రోబోలను తెప్పించి అందుబాటులో ఉంచుతామని యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ప్రసిడెంట్ వంగపండు వెంకట నాగరాజు తెలిపారు.

Just In...