Published On: Fri, Apr 13th, 2018

ఇంట‌ర్ ద్వితియ సంవ‌త్స‌రం ఫ‌లితాల్లో బాలికలదే విజ‌య‌కేత‌నం…

* 73.33 శాతం మంది ఉత్తీర్ణత 

* ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాలు 

* మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు 

* మంత్రి గంటా వెల్లడి 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికల హవా కొనసాగింది. ఈ ఏడాది 4,84,889 మంది విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయగా 3,23,645 మంది(73.33%) ఉత్తీర్ణులైనట్లు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్‌లో గురువారం మధ్యాహ్నం ఇంటర్‌ ద్వితీయ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ ఈ పరీక్ష ఫలితాల్లో బాలుర కంటే బాలికలు విజ‌య‌దుంధుభి మ్రోగించార‌న్నారు. 77% ఉత్తీర్ణతతో బాలికలు ముందుండగా.. బాలురు 70 శాతం  ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇంటర్‌ ఫలితాలను తొలిసారి పరీక్షలు ముగిసిన 24రోజుల వ్యవధిలోనే విడుదల చేసినట్లు చెప్పారు. 44 వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఈ ఏడాది నుంచి మార్కులకు బదులు గ్రేడింగ్‌ విధానాన్ని అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణను సీసీ కెమెరాలు, నిఘాబృందాల పర్యవేక్షణలో కట్టుదిట్టంగా చేపట్టినట్లు తెలిపారు. 1,423 కేంద్రాల్లో పరీక్షలను సజావుగా నిర్వహించిన ఇంటర్‌ బోర్డు అధికారులను మంత్రి అభినందించారు. సప్లిమెంటరీ పరీక్షలను మే 14 నుంచి నిర్వహిస్తామని, ఏప్రిల్‌ 21లోపు విద్యార్థులు రుసుం కట్టాలని తెలిపారు. కార్యక్రమంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి, కమిషనర్‌ బి.ఉదయలక్ష్మి, సీఈవో రమేష్‌, ఆర్జేడీ వై.వి.సుబ్బారావు, ఆర్‌ఐవో వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
                    ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.కృష్ణా 84 శాతం, నెల్లూరు 77, గుంటూరు 76 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కడప 59 శాతం ఉత్తీర్ణతతో చిట్టచివరి స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం 65, అనంతపురం 68 శాతం ఉత్తీర్ణతతో చివరి వరసలో నిలిచాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన కళాశాలల్లో.. విజయనగరం జిల్లా 80 శాతం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు 70 శాతం, చిత్తూరు 65 శాతంతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తక్కువ ఉత్తీర్ణత శాతం సాధించిన ప్రభుత్వ కళాశాలల్లో విశాఖపట్నం జిల్లా 47 శాతంతో చివరి వరసలో ఉండగా అనంతపురం, కడప 53 శాతంతో రెండో స్థానం, గుంటూరు జిల్లా 56 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల విషయంలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాలు.. చిత్తూరు, పశ్చిమ గోదావరి 66 శాతం, కృష్ణా 65 శాతం, అనంతపురం 52 శాతంతో నిలిచాయి. ఎయిడెడ్‌ విభాగంలో చివరి వరసలో ఉన్న మూడు జిల్లాల్లో విజయనగరం 37 శాతం, ప్రకాశం 40 శాతం, కర్నూలు 44 శాతం సాధించాయి.

Just In...