Published On: Sat, Jun 27th, 2020

ఇంద్ర‌కీలాద్రిపై జులై 3 నుంచి శాకంబరీ ఉత్సవాలు…

* ఆన్‌లైన్ స్లాట్ ప్రకారం టిక్కెట్ బుకింగ్‌

* ఆల‌య ఛైర్మ‌న్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు వెల్ల‌డి

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ఆషాడ మాసం పుర‌స్క‌రించుకుని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత కనకదుర్గమ్మ‌ ఆలయంలో జులై 3వ తేదీ నుంచి శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సంద‌ర్భంగా ఉత్స‌వాల‌కు సంబంధించిన ఏర్పాట్లు త‌దిత‌ర అంశాలను శ‌నివారం మ‌హామండ‌పంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు వెల్ల‌డించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. 5వ తేదీన ఉదయం పుర్ణాహుతితో ముగియనున్నాయ‌న్నారు. శాకంబరీ ఉత్సవాలకు వచ్చే భక్తులు టికెట్లను ఆన్‌లైన్ స్లాట్ ప్రకారం టిక్కెట్ బుక్ చేసుకునే రావాలన్నారు. కరోనా దృష్ట్యా శాకంబరీ ఉత్సవాల తొలి రెండు రోజులు అంతరాలయంలో మాత్రమే శాకంబరీ అలంకారం నిర్వహించనున్న‌ట్లు చెప్పారు. మూడో రోజు కూరగాయలతో మహామండపంతో పాటు ఇతర ప్రాంగణాలు అలంకరించడం జ‌రుగుతుంద‌న్నారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదం భక్తులకు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. శాకంబరీ ఉత్సవాలకు కూరగాయలను తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బోనాల కమిటీ సభ్యులు జూలై 5న అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. జులై 1 నుంచి దేవస్ధాన కేశఖండన శాల నందు తలనీలాలు స‌మర్పించేందుకు భ‌క్తుల‌ను అనుమతిస్తున్నామని తెలిపారు.

Just In...