Published On: Mon, Apr 23rd, 2018

ఇకపై ఎంచుకున్న విభాగాల్లో సేవలందించ‌వ‌చ్చు…

* శ్రీవారి సేవకులకు తితిదే అవకాశం

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: తిరుమలలో ఎంచుకున్న విభాగాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులకు టిటిడి అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈ నెల 25వ తేదీ నుండి భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. మే 2వ తేదీ నుండి తిరుమలలో సేవలు అందించాల్సి ఉంటుంది. టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు ఇదివరకే వ్యక్తిగతంగా సేవలందించేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ప్రస్తుతం శ్రీవారి సేవకులు బృందాలుగా, వ్యక్తిగతంగా శ్రీవారి సేవ చేసేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. నూతనంగా తిరుమలలో ముఖ్యమైన విభాగాలైన అన్నదానం, ఆరోగ్యశాఖ, నిఘా మరియు భద్రత, కల్యాణకట్ట, వసతి విభాగాలతో పాటు హెల్ప్‌డెస్క్‌, తిరునామం తదితర సేవలను ఎంచుకుని 3 రోజులు, 4 రోజులు, 7 రోజుల సేవ చేసేందుకు టిటిడి అవకాశం కల్పించింది. ఈ నూతన విధానాన్ని మే, జూన్ నెలల్లో ప్రయోగాత్మకంగా అమలుచేస్తారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని జులై నుండి పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఈ అవకాశాన్ని శ్రీవారి సేవకులు వినియోగించుకోవాలని కోరారు.

Just In...