Published On: Sat, Aug 31st, 2019

ఇకపై గిడ్డంగులే మార్కెట్ యార్డులు..

* డబ్ల్యుడిఆర్ఏ ఛైర్మన్ బి.బి.పట్నాయక్

సెల్ఐటి న్యూస్, విజయవాడ: రైతులు పండించిన పంటను నిల్వచేసే గోడౌన్ల వద్దే అమ్ముకునే విధంగా గిడ్డంగులను మార్కెట్ యార్డులుగా మలచుకోవాలని కేంద్ర మార్కెట్ వేర్ హౌసింగ్ డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యుడిఆర్ఏ) చైర్మన్ బి.బి.పట్నాయక్ అన్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ (ఇనామ్) మరియు ఎలక్ట్రానిక్ నేషనల్ వేర్హౌసింగ్ రిసీప్ట్ (ఇఎన్డబ్ల్యుఆర్)ల మధ్య రిజిస్ట్రేషన్, సమన్వయంపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖ, ఎన్ఐఎఎం జైపూర్ సంయుక్తంగా రైతులకు గిడ్డంగుల యజమానులు వ్యాపారులకు అధికారులకు ఒకరోజు వర్కుషాపును శనివారం విజయవాడలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన బి.బి.పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర గిడ్డంగులు (ఎస్డబ్ల్యుసిలు), కేంద్ర గిడ్డంగులు (సిడబ్ల్యుసిలు) ప్రైవేటు గిడ్డంగులు ఇతర గిడ్డంగులన్నీ కూడా ఇనామ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు మార్కెట్ యార్డులుగా అనుమతించిన గిడ్డంగులలోనే తమ పంటలను నిల్వ చేసుకొని ఎటువంటి అదనపు అదనపు ఖర్చులు లేకుండా మంచి ధరకు విక్రయించుకోవాలని సూచించారు. ఇనామ్ ఇఎన్డబ్ల్యుఆర్ లను అనుసంధానంచేస్తే రైతులు మంచి రేటుకు పంటలను అమ్ముకునే అవకాశం కలుగుతుందన్నారు. దీనివల్ల రైతు ధర ఎక్కడ ఎక్కువ ఉందో తెలుసుకొని అమ్ముకొనే అవకాశం అలాగే వ్యాపారులు కూడా ఎక్కడ ఏ ఉత్పత్తులు ఉన్నాయో తెలుసుకొని కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్లో 23 గిడ్డంగులను మార్కెట్ యార్డులుగా ప్రకటించి చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలో పంటలు ఎక్కువగా పండుతాయని దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు దేశ వృద్ధిరేటు పెరగడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గిడ్డంగులు నిర్మించేవారికి వారి సిబ్బందికి ఎంతమందికైనా తమ సంస్థద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇనామ్ వ్యవస్థ ద్వారా ఏర్పాటయ్యే డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా రాష్ట్రంలోని రైతులు తమ ఉత్పత్తులను రాష్ట్ర సరిహద్దులు దాటి అమ్ముకోవచ్చన్నారు. తమిళనాడులో సుమారు 450 సహకార సంఘాల గిడ్డంగులను రిజిష్టరుచేసి ఇఎన్డబ్ల్యుఆర్తో అనుసంధానం చేశారన్నారు. ఈ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో రైతులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. గిడ్డంగులు నిర్మించేవారు ఇనామ్ వ్యవస్థలో రిజిష్టర్ చేసుకొని ఇఎన్డబ్ల్యుఆర్ తో అనుసంధానం కావాలన్నారు. కేంద్ర మార్కెటింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ పి.కె.స్వయిన్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి గోడౌను యజమానులు నిర్వాహకులు ఇనామ్లో రిజిష్టరు చేసుకొని ఇఎన్డబ్ల్యుఆర్ తో అనుసంధానం కావాలన్నారు. రైతు శ్రేయస్సుకోసం కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే పంటలను ఆన్ లైన్ ద్వారా అమ్ముకొనే అవకాశం కల్పించిందన్నారు. ఆన్ లైన్లో రైతులు తమ ఉత్పత్తులను మంచి రేటుకు అమ్ముకోవచ్చని కొనుగోలుదార్లు కూడా ప్రపంచంలో ఎక్కడ నుండైనా ఇనామ్ ద్వారా కొనుగోలు చేయొచ్చన్నారు. రైతులు తమ ఉత్పత్తులను గోడౌన్లలో నిల్వ చేసుకొని ఎలక్ట్రానిక్ నేషనల్ వేర్హౌస్ రిసీప్టుల ద్వారా బ్యాంకుల నుండి రుణాలు కూడా పొందవచ్చన్నారు. రైతులు, వ్యాపారులు మొబైల్ యాప్ ద్వారా కూడా తమ ఇంటివద్దనుండే నాణ్యతను పరిశీలించుకొని అమ్మకాలు కొనుగోళ్ళు చేసుకొని మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చన్నారు. గుంటూరు మార్కెట్ దేశంలోనే అతిపెద్ద ఇనామ్ మార్కెట్ అని మిర్చి ట్రేడింగ్లో ఆసియాలో అతి పెద్దదని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇనామ్ను విజయవంతంగా అమలుచేస్తున్నందుకు ఆశాఖ స్పెషల్ సెక్రటరీ మదుసూదనరెడ్డి, స్పెషల్ కమీషనర్ పి.ఎస్. ప్రద్యుమ్నను పట్నాయక్, స్వయిన్ అభినందించారు.

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం…

రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మదుసూదన రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని గిడ్డంగులను మార్కెట్ యార్డులుగా ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. రైతులు తాము పండించిన పంటలలో నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి గిడ్డంగులకు తీసుకు రావడానికి ముందే శుభ్రంచేసి, గ్రేడింగ్ చేసి తీసుకు వస్తే గిడ్డంగుల దగ్గరకు తీసుకు వచ్చిన తరువాత బాగుచేయడానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని సూచించారు. గిడ్డంగుల యజమానులు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అదేవిధంగా వ్యాపారులు కూడా రైతులకు ఎక్కువ ధర వచ్చేలా కృషిచేయాలని చెప్పారు. తద్వారా రైతులు వ్యాపారులు గిడ్డంగుల నిర్వాహకుల మధ్య పరస్పరం నమ్మకం కుదురుతుందన్నారు.

Just In...