Published On: Tue, Jul 9th, 2019

‘‘ఇక‌పై మీ ఇంటి తలుపు తట్టి పింఛను ఇస్తారు’’..

* సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి అమ‌లు

* కడప జిల్లా జమ్మలమడుగు రైతు దినోత్సవ సభలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, జమ్మలమడుగు (క‌డ‌ప‌): కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరోసారి శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజులు లోపే వృద్ధాప్య పింఛనును రూ.2,250కు పెంచామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5.4లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా సోమవారం ఉద‌యం కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రసంగించారు. తమ ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ రైతే కన్పించాలనేది తమ ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలతో పాటు రాబోయే కాలంలో చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..  ‘‘సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి మీ ఇంటి తలుపు తట్టి పింఛను ఇస్తారు. అదే రోజు నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటికి వచ్చి వివరిస్తారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరు. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లంచం తీసుకున్నట్టు రుజువైతే వారిని ఉద్యోగంలో నుంచి పీకి పారేస్తాం. ఇక నుంచి వైఎస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతాం. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఉంది. గత ప్రభుత్వ హయాంలో 2014-15లో పింఛన్లకు రూ.3,378 కోట్లు ఖర్చు చేయగా.. 2015-16లో రూ.5,201 కోట్లు, 2016-17లో 5,270 కోట్లు, 2017-18లో రూ.5,436 కోట్లు ఖర్చు చేశారు. 2018-19లో మాత్రం ఎన్నికలకు నాలుగు నెలల ముందు రూ.8,234 కోట్లు ఖర్చు చేశారు. కానీ.. నెల తిరగకుండానే మా ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.15,675 కోట్లు ఖర్చు చేసింది’’ అని వివరించారు.
‘‘రైతుల పంట రుణాల కోసం కేవలం ఈ ఏడాదికి రూ.84వేల కోట్లు పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. రుణాలు తీసుకున్న రైతులు నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లిస్తే వాటిపై ఏమాత్రం వడ్డీ చెల్లించనక్కర్లేదు. జూన్‌ 1 నుంచి జులై 7 వరకు కడప జిల్లాలోనే రూ.1000 కోట్ల పంట రుణాలు ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నాం. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకుంటాం. అన్నదాతలకు తోడుగా వైఎస్‌ఆర్‌ భరోసా పథకం తీసుకొచ్చాం. వచ్చే ఏడాది ఇవ్వాల్సిన ఈ పథకాన్ని 7 నెలల ముందే ఇస్తున్నాం. రాష్ట్రంలో 70శాతం మంది రైతులకు హెక్టారులోపు పొలమే ఉంది. రైతు భరోసా కింద 70లక్షల మంది రైతులకు రూ.8,750 కోట్లు ఇవ్వబోతున్నాం. తుపాన్లు వచ్చినప్పడు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పుడు మేం ఇస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లపై రోడ్డు పన్ను రద్దు చేశాం. రైతు భరోసా వంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదు. వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాం. అధికారంలోకి రాగానే పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశాం. అరటి రైతుల గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదు. రైతుకు జరగరానిది జరిగితే రూ.7 లక్షలు చెక్కు అందిస్తాం’’ అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.
‘‘సహకార రంగం పునరుద్ధరణకు తొలి ఏడాదిలోనే చర్యలు చేపడుతున్నాం. మూతపడిన చక్కెర పరిశ్రమలను తెరిచి చెరకు రైతులకు అండగా ఉంటాం. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు అందిస్తాం. నాణ్యమైన విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యత పరిశీలనకు ప్రతి నియోజకవర్గంలో ల్యాక్‌ ఏర్పాటు చేస్తాం. ఎరువులు, విత్తనాలను సైతం గ్రామాల్లోకి తీసుకొచ్చి అందిస్తాం.రూ.3వేల కోట్లతో రైతులకు ధరల స్థిరీకరణనిధి. పంటలు, మద్దతు ధర సమస్యలపై నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తాం. మేం వేసే ప్రతి అడుగులోనూ రైతే కన్పించాలనేది మా ఉద్దేశం. గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి రాయలసీమ, ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తాం. కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు శ్రీకారం చుట్టాం. కరవు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని, ప్రాజెక్టుల విలువ బాగా తెలుసు’’ అని జగన్‌ అన్నారు.

Just In...