Published On: Mon, Jul 15th, 2019

ఇక అట‌వీ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ చ‌ట్టం పున‌రుజ్జీవం

* అర‌వై రోజుల‌ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో గిరిజ‌న సంక్షేమ శాఖ

* ఐటిడిఎ పిఓల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రికార్డుల కంప్యూట‌రీక‌ర‌ణ‌

* కేంద్రంతో స‌హా అన్ని శాఖ‌ల‌కు అందుబాటులో రికార్డులు

* గిరిజ‌నుల‌కు అందుబాటులో  రుణాలు, ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: నీరు గారుతున్న అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని పునరుజ్జీవింపచేసి, వాస్తవ ప్రయోజనాలు గిరిజ‌న రైతుల‌కు చేరేలా ప్రభుత్వం ముందడగు వేస్తుంది. గిరిజన సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్ఓఎఫ్ఆర్  చట్టం ద్వారా భూమిపై టైటిల్ పొందిన గిరిజన రైతులకు అన్ని ప్రయోజనాలు, ప్రభుత్వపరమైన లబ్డి చేకూరేలా గిరిజన సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యాచరణను సిద్దం చేసింది. రెండు నెల‌ల‌ కాలపరిమితితో కూడిన ఈ ప్రణాళిక అమలు తదుపరి, అటవీ హక్కుల చట్టం ప్రకారం రాష్ట్రంలో టైటిల్ పొందిన ప్రతి గిరిజనుడు సగటు రైతుతో సమానంగా పూర్తి హక్కులు పొందగలిగేలా వ్యవస్ధ రూపుదిద్దుకోనుంది. నిజానికి అటవీ సంరక్షణ, పర్యావరణ సమతుల్యత ఆదివాసుల మీద ఆధారపడి ఉంటాయి. అటవీ హక్కుల గుర్తింపు చట్టం స్ఫూర్తిని, మౌలిక ఉద్దేశాన్ని గత ప్రభుత్వాలు కాలరాసిన ఫలితంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 (నెం.2/2007) అపహాస్యం అయ్యింది. అడవిలో నివసించే ప్రజల హక్కులను గుర్తించాలనే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టంగా 2006లో ఆమోదం పొందింది.  అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని అడవి ఉన్న అన్ని ప్రాంతాలకు వర్తింపచేసి, గిరిజనులకు గుర్తించి వారికి భూమిపై టైటిల్ హక్కును ఇచ్చారు.  కాని వారికి భూమి ఉన్నా దానిపై రుణం రావ‌టం లేదు.  ఏ ప్రభుత్వ పధకం కింద లబ్ది చేకూరదు. రాష్ట్రంలో దాదాపు 96వేల గిరిజనులు ఈ విధానంలో భూమి పొందినా , వారిలో ఐదు శాతం మంది కూడా సగటు రైతులు అనుభించే అన్ని హక్కులు పొందలేకున్నారు.
ఈ విధానాన్ని సరిదిద్దాలన్న సిఎం ఆలోచనలు కార్యరూపం దాల్చే క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలోని ఐటిడిఎల పరిధిలో పెద్ద కసరత్తు మొదలైంది. ఈ విషయంపై ఐటిడిఎ పిఓలతో ఇటీవ‌ల సమావేశం అయిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వారికి దిశా నిర్ధేశం చేసారు.చ‌ట్టం ప్రకారం డిసెంబర్ 13, 2005 కన్నా ముందు నివసిస్తున్న, సాగుచేసుకుంటున్న ప్రజలకు వ్యక్తిగత, సామూహిక హక్కులు గుర్తించి, దఖలు పరిచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. 13 రకాల హక్కులతో పాటు అడవిని, జీవవైవిధ్యాన్ని సుస్థిరంగా కాపాడటంలో, పరిరక్షించడంలో ఆదివాసులకు బాధ్యతలు, అధికారాలు కల్పించారు. ఇలా గిరిజ‌నులు భూ య‌జ‌మానులు అయ్యారు. కాకుంటే ఇదంతా కాగితాలకే పరిమితం అయ్యింది. చట్టం ద్వారా హక్కులు పొందిన గిరిజన రైతులు ద్వితీయ శ్రేణి పౌరుల తరహాలో ఆందోళన చెందవలసిన పరిస్ధితి నెలకొంది. భూమి కలిగిన వ్యక్తిగా వారికి రావలసిన హక్కులు దక్కలేదు. ఏ బ్యాంకు వీరికి రుణం ఇవ్వలేదు. రైతు భరోసా కావచ్చు, ప్రధాన మంత్రి కిసాన్ యోజన కానూవచ్చు, వీరికి రూపాయి ల‌బ్ది చేకూర‌లేదు. ఈ పరిస్ధితిని అధికమింపచేస్తూ గిరిజ‌న సంక్షేమ శాఖ రెండు నెల‌ల‌ కాలవ్యవధితో కూడిన కార్యాచరణకు రూపకల్పన చేసింది. దీనిని అనుసరించి అయా ఐటిడిఎల పరిధిలో, చ‌ట్టం ప్ర‌కారం టైటిల్ పొందిన గిరిజ‌న  హక్కుదారులను గుర్తించి వారి డేటాను కంప్యూటరీకరిస్తారు. తదుపరి వారి అధార్ వివరాలను అనుసంధానం చేయటంతో పాటు, వారి బ్యాంకు ఖాతా వివరాలను కూడా రికార్డు చేసి విస్పష్టమైన డేటాను అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ నేపధ్యంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ పూర్తి వివరాలతో తయారు చేసిన రికార్డులను అధికారికంగా ప్రభుత్వ శాఖలకు అందుబాటులో ఉంచుతామని,  కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా పంపుతామని తెలిపారు. ఫలితంగా అన్ని రకాల ప్రభుత్వ పధకాలకు వారిని అర్హులను చేస్తామని వివరించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం స్ఫూర్తిని, మౌలిక ఉద్దేశాన్ని పరిరక్షించాలన్న సిఎం ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నామన్నారు. అటవీ సంరక్షణ, పర్యావరణ సమతుల్యత , చరిత్ర, భవిష్యత్తు నిజానికి గిరిజనుల మీదే ఆధారపడి ఉంటుందని,  భూతల్లిని సంరక్షించి, ప్రకృతి వనరులను భావితరాలకు అందించేది ఆదివాసులు మాత్రమేనని వివ‌రించారు. రికార్డుల న‌మోదు, నిక్షిప్తం వంటి అంశాల‌పై ఐటిడిఎ పిఓల స్వ‌యం ప‌ర్య‌వేక్ష‌ణ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు, పార‌ద‌ర్శ‌కంగా, లోప‌ర‌హితంగా కార్య‌క్ర‌మాన్ని తీసుకువెళ‌తామ‌ని మీనా అన్నారు.

Just In...